రాఖీ పండగ వచ్చిందంటే ఆ అక్కాచెళ్లెళ్లకు పండుగ. ఒక్కగానొక్క అన్న. తమ మంచిచెడులు చూసే పెద్ద దిక్కాయనే. నాన్న చనిపోయినంక ఆయనే అన్నైనా.. నాన్నైనా. అలాంటి అన్నకు రాఖీ కట్టేందుకు ఒకరోజు ముందే పయనమయ్యారు ఆ అక్కాచెళ్లెళ్లు పుట్టింటికి. తెల్లారితే రాఖీ పౌర్ణమి.రాత్రి భోజనం తర్వాత అన్నతో కాసేపు మంచీచెడూ మాట్లాడారు. ఆత్మీయ పలకరింపులు.. పాత మధురజ్ఞాపకాలన్నీ నెమరవేసుకున్నారు. చెల్లెండ్ల కోసం చీరలు తెప్పించాడు. రాత్రంతా ఆనందంతో ఆదమరచి నిద్రపోయారు. ఆ నిద్రలోనే ఆ అన్న గుండె ఆగింది. తెల్లారిన తర్వాత ఈ విషయం తెలిసి ఆ అక్కాచెళ్లెండ్ల గుండెలూ ఆగిపోయాయి. విలవిలలాడారు. తమ వేలిపట్టి నడిపించిన అన్న ఇక కానరాని లోకాలకు వెళ్లాడని గుండెలవిసేలా ఏడ్చారు. విగతజీవుడైన ఆ అన్న చేతికే రాఖీని కట్టి కన్నీరుమున్నీరయ్యారు.
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం మాలగూడెంలో రాఖీ పండగనాడు ఈ విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ అక్కాచెల్లెళ్ల సోదరుడు చింతపల్లి లక్ష్మయ్య ప్రాణాలు కోల్పోయాడు.రాఖీ పౌర్ణమికి ముందురోజు జరిగిన ఈ ఘటన గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదాన్ని నింపింది.
