గాంధీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన అక్కాచెల్లెల్లు అక్కడ ఉద్యోగుల చేత గ్యాంగ్‌రేప్‌కు గురయ్యారనే వార్త కథనాలు ప్రసారం చేసిన టీవీ 9, ఎన్టీవీ విలేఖరులను పిలిచి మరీ గట్టిగా క్లాస్ తీసుకున్నాడు డీజీపీ మహేందర్ రెడ్డి. గాంధీకి మూత్రపిండాల వ్యాధితో వచ్చిన ఓ పేషంట్ తరపు భార్య, మరదలిని అందులో పనిచేసే ఉద్యోగి ఒకరు వేరే సిబ్బందితో కలిసి కొన్ని రోజుల పాటుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఈ మీడియాల్లో మొదట బ్రేకింగ్ న్యూస్‌లు వచ్చాయి. ఆ తర్వాత మిగిలిన మీడియా సైతం దీన్ని అందిపుచ్చుకుని వార్తలు ప్రచురించింది.
అయితే పోలీసులు లోతుగా విచారణ చేసి తెలుసుకున్న వాస్తవమేమిటంటే.. ఇద్దరు అక్కాచెల్లల్లకు చాలా రోజులుగా కల్లు తాగే అలవాటు ఉంది. ఈ మందు కల్లు రోజు సేవించకపోతే మానసికంగా ఇబ్బందులు పడతారు. అలాంటి పరిస్థితే వీరికీ వచ్చింది. మతిస్థిమితం కూడా కోల్పోయిన పరిస్థితుల్లో తన పై అత్యాచారం జరిగిందని చెప్పడంతో పోలీసు కేసు వరకు వెళ్లింది. దీంతో ఈ విషయం బయటకు వెలుగు చూసి మీడియా చిలువలుపలువలుగా కథనాలు గుప్పించింది. ఈ విషయం రచ్చరచ్చ అయ్యింది. గాంధీ ఆస్పత్రి ప్రతిష్టకు మచ్చలా మారింది. ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసులు దీని పై లోతుగా దర్యాప్తు చేశారు.
మీడియాలో సంచనాల కోసం నిజనిర్ధారణ చేసుకోకుండా బ్రేకింగ్ న్యూస్‌ల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వచ్చిన కథనాల పట్ల డీజీపీ మహేందర్ రెడ్డి సీరియస్ అయ్యాడు. టీవీ 9, ఎన్టీవీ రిపోర్టర్లను పిలిపించి మరీ క్లాస్ తీసుకున్నాడు. మీడియాలో ఈ విషయం చక్కర్లు కొడుతున్నది.