ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా.. వెబ్ సైట్ చూసినా.. ‘షాక్..’, ‘షాకింగ్’ అనే మాటలతో మొదలుపెట్టి.. మెల్లగా ముగ్గులోకి దింపి.. వ్యూయర్‌షిప్ పెంచుకోవాలని చూస్తాయి. పాపం. వాళ్ల కష్టాలు వాళ్లవి. ఏదో షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నారని, ఇందులో ఏదో షాక్‌కు గురయ్యే విషయమేదో ఉందని మనం భ్రమపడాలన్నమాట. అలా ఉత్సుకతతో లోపలికి వెళ్లి రావాలన్నమాట. ఆ యూట్యూబ్, వెబ్సైట్ వార్తను వీక్షించి, సమీక్షించి రావాలన్నమాట. అప్పుడుగానీ వాళ్లకు పూటగడవదు. కానీ ఆ పూట గడవడం కోసం వాళ్లు పెట్టుకున్న ‘షాకింగ్’ కు అర్థమైనా ఉంటుందా ..? అంటే అదీ ఉండదు. అందులో విషయమే ఉండదు. ‘కొండంత రాగం తీసి..’ అన్నట్టుగా.. ‘బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కవ’ అన్నట్టుగా ఉంటుంది వీరి వ్యవహారం. పైన చెప్పిన విషయానికి లోపల మ్యాటర్‌కు పెద్దగా సంబంధం ఉండదు. ఇలా నడుస్తుంది ట్రెండ్. కానీ ‘నమస్తే తెలంగాణ’ కూడా పాపం ‘షాకింగ్”నే నమ్ముకుంటున్నట్టున్నది. ఎక్కువ వ్యూస్ రావాలంటే బహుశా ఈ ట్రెండ్‌నే ఫాలో కావాలని ఎవరైనా చెప్పారో…? వారే శోధించి తెలుసుకున్నారో తెలియదు కానీ… ఇలా ‘షాకింగ్’ అనే నామకరణంతో మొదలుపెట్టడం షురూ చేశారు. నిన్న నమస్తే ఇంటర్నెట్ సైట్‌లో ఓ వార్త ఇలాగే కనిపించింది. ‘అవునూ … అది గ్యాంగ్ రేప్ వార్త కదా.. మరి దాని హెడ్డింగ్ కు ముందు ‘షాకింగ్’ అని పెట్టారు.. గ్యాంగ్ రేప్ జరిగితే షాకింగా?’
‘దారుణం’, ‘హోరం’ అని ఏదో ఒకటి రాస్తారు కదా. ఓహో .. ‘షాకింగ్’ అంటేనే ఎక్కువ మంది చూస్తారా? అలాగే కానీయ్. నీకు చెప్పేదెవరు?