పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఎదురులేదని అంతా అనుకున్నారు. కానీ, ఆదిలోనే హంసపాదులా ఆయనకు ఆటంకాలు తప్పలేదు. చీఫ్‌గా ఆయన నియామకం తర్వాత పార్టీలో నూతనోత్తేజం వచ్చింది. ఇంద్రవెళ్లిలో దళిత తండోరా కూడా విజయవంతమైంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులకు జీవమొచ్చినట్లైంది. అదే ఊపులో రేవంత్‌రెడ్డి అదే వేదిక మీద ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో కూడా దళిత దండోరా నిర్వహిస్తున్నామని ప్రకటించాడు.
కానీ ఇక్కడే కథ రివర్స్ అయ్యింది. ఇబ్రహీంపట్నం భువనగిరి పార్లమెంటు పరిధికి వస్తుంది. తనకు తెలయకుండా, కనీస సమాచారం లేకుండా , అనుమతి లేకుండా మీటింగు ఎలా అనౌన్స్ చేస్తావని కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి అడ్డం తిరిగాడు. ఇది చినికి చినికి గాలివానలా మారింది. అధిష్ఠానం దగ్గరకు చేరింది పంచాయితీ. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీనిపై సుముదాయించాలని చూసినా.. వెంకట్‌రెడ్డి వినలేదు. దీంతో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అందరినీ కలుపుకొని పోదామని రేవంత్ వ్యూహాలు రచిస్తూ విజయవంతమవుతున్న తరుణంలో .. కోమటిరెడ్డి రూపంలో అడ్డు తగలడం అశనిపాతంలా మారింది. దీంతో చేసేదేమి లేక… ఈ సభను అదే రోజు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని రావిర్యాలకు మార్చాడు.
పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే.. ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేసి పారేస్తానని హుకుం జారీ చేసి తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేసిన రేవంత్…. కాంగ్రెస్‌లో అదంతా ఈజీ కాదని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎవరి స్వేచ్ఛ వారికి ఉన్న ఈ జాతీయ పార్టీలో అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడం రేవంత్ అనుకున్నంత సులువైన పనేం కాదు. కాగా త్వరలో నల్లగొండలో కూడా ఓ సభను ఏర్పాటు చేసేందుకు సన్నద్దమయ్యారు. అక్కడ సపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి.