కడియం శ్రీహరిని దళితదొర అని పిలుచుకుంటారు ముద్దుగా. ఆయన ముక్కుసూటి మనిషి. ఏది కరెక్టనిపిస్తే అది మాట్లాడేస్తాడు.మర్మం తెలియదు. లౌక్యం అంతకన్నా తెలియదు. సబ్జెక్టు మీద మంచి పట్టున్నోడు. కానీ రాజకీయాల్లో ఇవి నడవవు. టీడీపీలో నడిచింది. అదే కంటిన్యూ చేద్దామనుకున్నాడు. కేసీఆర్ దగ్గర దెబ్బైపోయాడు.
అవును.. కడియం శ్రీహరి ఇతర రాజకీయ నాయకులతో పోల్చితే సబ్జెక్టు, సభ్యత తెలిసినోడు. మరి టీఆరెస్ గవర్నమెంటులో ఎందుకు కొట్టుకుపోయాడు. కనిపించకుండా ఎందుకు పోయాడు? సో సింపుల్. ఈయనకు జోకుడు రాదు. ఉన్నదున్నట్టు మాట్లాడతాడు. అందుకే ఇప్పటి జోకుడు రాజకీయాల నుంచి బహిష్కరించబడ్డాడు. ఊరిపొలిమేరలకు తరిమేయబడ్డాడు. పదవి వచ్చినట్టే వచ్చి వెక్కిరించి వెళ్లిపోయింది. మోత్కుపల్లిలా అవకాశవాద రాజకీయాలు అలవాటు చేసుకోలేదు పాపం కడియం. తాజాగా ఆయన దళితబంధుపై చేసిన కామెంట్ మీడయాలో చక్కర్లు కొడుతుంది.
దళితబంధు అంతటా అమలు చేయకపోతే టీఆరెస్‌కు నష్టం తప్పదు అని కడియం అన్నట్టుగా వార్తా కథనాలు వచ్చాయి. ఆయన మాట్లాడిన వీడియో చూసిన తర్వాత అందులో తప్పేం లేదనిపించింది. అందునా.. ఆయన కేసీఆర్‌ను బ్లాక్ మెయిల్ చేసినట్టుగా కూడా ఏమీ అనిపించలేదు. అది ఆయన సహజ దోరణే. తెచ్చిపెట్టుకున్న బుద్ది కాదు. పదవుల కోసం అరువు తెచ్చుకున్న డైలాగులు కానేకావు.
అవును.. దళితబంధు అమలు వెనుక కేసీఆర్ చాలా కృషి చేశాడని చెప్తూనే.. ఇది ఒక్క హుజురాబాద్ కోసం రచించిన పథకం కాదనిచెప్పాడు. ఒకవేళ రాష్ట్రం మొత్తం దీన్ని అమలుచేయకపోతే నష్టం జరుగుందనే విషయం కేసీఆర్‌కూ తెలుసు. మరి అలాంటప్పుడు ఇలా ఒక హుజురాబాద్ కోసమే దీన్ని ప్రవేశపెట్టాడనే ఆరోపణల్లో పసలేదని ఆయన కొట్టిపారేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడున్నదంతా అష్టవంకరల వక్రమీడియా కదా.! దీన్ని తనదైన శైలిలో వక్రీకరించుకుని పైశాచికానందం పొందుతున్నది. కడియం మాట్లాడిన మాటల్లో ఎంత వాస్తవం ఉందో… పరోక్షంగా కేసీఆర్‌కు ఇది కత్తిమీద సామే అని చెప్పడంలో కూడా అంతే వాస్తవం ఉంది.
అవును ఆయన సీనియర్ రాజకీయనాయకుడు. అందరిలా ఫక్తు అవకాశ వాద రాజకీయనాయకుడైతే కాదు. కానీ ఆయన్ను దళిత దొర అన్నారు. ముక్కుసూటిగా ఉన్నదున్నట్టు మాట్లాడితే దొరా..! అసలు దొర మన కేసీఆరే.. ఎందుకంటే ఆయనకు ప్రశ్నించడం నచ్చదు. వ్యతిరేకిస్తే గిట్టదు. తిరగబడితే అరగదు. కలియబడితే ఓర్వడు. కేసీఆరే దొర అంటే. బానిసలను ఎలా దరికి చేర్చుకోవాలో తెలిసినవాడు. పదవుల ఆశచూపి కుక్కల్లా తనచుట్టూ ఎలా తిప్పించుకోవాలో తెలిసిన నయా దొర ఆయనే. కడియం కాదు.