బోధన్ ఎమ్మెల్యే షకీల్ నాలుగు నెలలుగా అజ్ఞాతంలోనే ఉండిపోయాడు. రెండ్రోజులుగా ఆయన నియోజకవర్గంలోని తన నివాసానికి వచ్చాడు. కొందరితో మాత్రమే కలుస్తున్నాడు. పొడిపొడిగా మాట్లాడుతున్నాడు. ఆయన అజ్ఞాతం వీడినా.. ఇంకా పార్టీ పెద్దలపై అసంతృప్తి వీడలేదు. అలకపాన్పు దిగలేదు. ఎమ్మెల్యే తండ్రి నాలుగు నెలల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఆయన బోధన్‌కు రావడమే మానేశాడు. అజ్ఞాతవాసం కొనసాగించాడు. తండ్రిలేని ఆ ఇంటికి రావాలనిపించడం లేదని తన సన్నిహితుల వద్ద బాధపడినట్లు తెలిసింది. దీనికి తోడు తన తండ్రి చనిపోతే కూడా పరామర్శించేందుకు కేసీఆర్ రాలేదని ఎంతో మదనపడ్డాడు షకీల్. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా…. బాల్కసుమన్.. ఇంటికి వెళ్లి పరామర్శించిన సీఎం.. తన నివాసానికి ఎందుకు రాలేదు? ఇదీ షకీల్‌ను వేధిస్తున్న అంశం. రాష్ట్రంలోనే ఒకే ఒక మైనార్టీ ఎమ్మెల్యే తను. పార్టీలో సముచిత స్థానం లేదు.. పదవులు లేవు. పనికిరాని వాడిగా అయిపోయాడు. ఇప్పుడు తండ్రిచనిపోతే పరామర్శకు కూడా నేను తగనా? అని షకీల్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడట. నాలుగు నెలల తర్వాత ఆయన బోధన్‌లో రెండ్రోజుల మకాం వేశాడు. కానీ ఎవరినీ పెద్దగా కలవడం లేదు. ఇంకా అలకపాన్పు దిగలేదు. ఈ విషయం ఆనోటా ఈనోటా పెద్దాయనకు చేరింది. కానీ ఆయన పట్టించుకోవడం లేదు. కనీసం కేటీఆర్ కూడా తన ఇంటికి రాకపోవడం షకీల్‌ను మరింత ఇబ్బందికి గురిచేసింది. ఇక తన సేవలు పార్టీకి అవసరం లేదనుకుంటున్నారా? వచ్చేసారి టికెట్ డౌటేనా? ఏవోవే అనుమానాలు, ప్రశ్నలు వేధిస్తున్నాయి షకీల్‌ను. త్వరలో సీఎం కేసీఆర్ నిజామాబాద్‌కు రానున్నాడు. ఇక్కడ కొత్త కలెక్టరేట్, పార్టీ భవనాన్ని ప్రారంభించనున్నాడు. అప్పుడైనా తన ఇంటికి రాకపోతాడా? పరామర్శించకపోతాడా? అని పాపం షకీల్ ఆశగా ఎదురుచూస్తున్నాడట.