పోలీస్ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శ్నిస్తూ, వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను అనుకూలంగా మ‌లుచుకుని కొంత మంది పోలీసుల అండ‌దండ‌ల‌తో రెచ్చిపోయి ఎదిగిన ఆ రౌడీ షీట‌ర్‌.. చివ‌ర‌కి పోలీసుల పైనే తుపాకీ ఎక్కుపెట్టాడు. నేత‌ల అండ‌, అంగ‌బ‌లం తోడురాగా పోలీసుల‌కు మ‌చ్చిక చేసుకుని రాజ్యాంగేత‌ర శ‌క్తులుగా ఎదుగుతున్న వారిని ప‌రోక్షంగా ఎంకరేజ్ చేస్తే ఇలా త‌మ క‌ణ‌త‌కే రివ్వాల‌ర్ ఎక్కుపెట్టే ప‌రిస్థితులు వ‌చ్చాయ‌ని చెప్ప‌డానికి ఇందూరులో జ‌రిగిన ఈ రౌడీ షీట‌ర్ ఉదంత‌మే నిద‌ర్శ‌నం.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర‌వ టౌన్ ప‌రిధిలో రౌడీ షీట‌ర్ ఆరీఫ్ ఓ డ‌మ్మీ పిస్తోల్‌తో గాల్లోకి కాల్పులు జ‌రిపి వార్త‌ల్లోకి ఎక్కాడు. ఓ ప్రైవేట్ ఫంక్ష‌న్‌లో దోస్తుల‌తో క‌లిసి ఇలా పిస్తోల్‌తో దాదాగిరి చేస్తూ త‌న రౌడీయిజాన్ని ప‌ది మందికి తెలియ‌జేసి, మ‌రింత భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసి ప‌బ్బంగ‌డుపుకుందామ‌ని చూసిన ఆరీఫ్‌ను ఎట్ట‌కేల‌కు ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ కార్తికేయ శ‌ర్మ ఈ వివ‌రాల‌ను విలేఖ‌రుల‌కు వెల్ల‌డించాడు.

పోలీసులు ఆరీఫ్‌ను అదుపులోకి తీసుకుంటున్న క్ర‌మంలో ఎదురు తిరిగార‌ని, పిస్తోల్‌తో కాల్చి చంపేస్తాన‌ని బెదిరించిన‌ట్లు స్వ‌యంగా సీపీ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. అంటే పోలీసుల‌కు కూడా భ‌య‌ప‌డ‌ని విధంగా ఆ రౌడీ షీట‌ర్ పెంచి పోషించ‌బ‌డిన తీరు అంద‌రిని విస్తుపోయేలా చేసింది. అమోజాన్ నుంచి బొమ్మ‌ తుపాకీ తెప్పించుకుని రౌడీ షీట‌ర్‌గా మ‌రింత ఫేమ‌స్ అయ్యేందుకు ఫంక్ష‌న్‌లో గాల్లో కాల్ప‌లు జ‌రిపిన‌ట్లు ఒప్పుకున్నాడ‌ని పేర్కొన్నాడు. దీనిపై ఇంకా స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపితే ఆరీఫ్ లాంటి క‌రుడుగ‌ట్టిన రౌడీ షీట‌ర్లు, అనుచ‌రులు, వారి వ‌ద్ద ఉన్న ఆయుధాలు అన్నీ బ‌య‌ట‌కు వ‌స్తాయి.