హుజురాబాద్ అందరికీ కలిసివస్తుంది. ఈ ఉప ఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు పండగలా మారింది. ప్రజల కరువు తీరుతున్నది. కడుపు నిండుతున్నది. కరోనా కూడా అంటుతున్నది. కొద్ది మంది నేతలకు మాత్రం అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. ఎప్పుడూ ఊహించని పదవులు వరిస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఇంతలా బంగారుమయం అవుతుందని బహుశా ఏ రాశిలో రాసి లేదేమో! ఏ జ్యోతిష్యుడూ చెప్పి ఉండకపోవచ్చు. కనీసం ఊహకు అందకపోవచ్చు. కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఎంతోమందికి ఎన్నో విధాలుగా మేలు జరిగినా.. మనం ఇప్పుడు ఈ కథనంలో ప్రత్యేకంగా చెప్పుకుంటున్నది మాత్రం ఓ ఇద్దరి గురించి. లక్కీ బాయ్స్ గురించి. అవును.. వాళ్లు నిజంగా లక్కీ బాయ్సే. ఎందుకంటారా? అయితే చదవండి.
అతి చిన్న వయస్సులో ఈ ఇద్దరికి హుజురాబాద్ వరంలా మారింది. రాజకీయ భవిష్యత్తును ప్రసాదించింది. ఒకరు పాడి కౌశిక్‌రెడ్డి కాగా.. మరొకరు గెల్లు శ్రీనివాస్ యాదవ్. గెల్లుకు ఈరోజు టీఆరెస్ అభ్యర్థిగా టికెట్ కన్ఫాం చేశారు. కౌశిక్ రెడ్డి వయస్సు 34. గెల్లుకు 38.ఈ ఇద్దరికీ తక్దీర్ మారిపోయింది. చిన్న వయస్సులోనే ఇలా అవకాశం కలిసొచ్చింది. మొన్నటి వరకు వీరిద్దరు ఎవరో చాలా మందికి తెలియదు . కానీ ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక రాజకీయ తెరమీద వెలిగిపోతున్నారు.
కౌశిక్ రెడ్డి పేరు మొన్నటి దాక ఎవరికీ తెలియదు. ఈటలపై పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత కనుమరుగై పోయాడు. కనిపించలేదు. అనూహ్యంగా హుజురాబాద్‌కు ఉప ఎన్నిక పరిస్థితి వచ్చేలా రాజకీయ సమీకరణలు మారాయి. పిల్లకి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటంలా ఒక్కొక్కప్పుడు రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. అలా కలసి వచ్చింది పాడి కౌశిక్‌రెడ్డికి. ఏడనో మూలనున్నోడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిండు. ఇక కాంగ్రెస్‌లో నాకే టికెట్.. ఇక నేనే గెలుస్తానని బీరాలు పలికాడు. వాస్తవంగా కౌశిక్‌కు అక్కడ అంత సీన్ లేదు. అతన్ని ఏనాడో ప్రజలు మర్చిపోయారు. అతనూ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.
ఇలా రాజేందర్ పుణ్యమా అని కలిసివచ్చిన అవకాశం అతన్ని అందలమెక్కిస్తుందని అనుకోలేదు. ఈటలను ఎదుర్కొనేందుకు, ఈ ఎన్నికలో గెలిచేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నాలు లేవు. మూలకున్నోళ్లను ముందేశాడు. లేని పరపతి అంటగట్టాడు. బలవంతంగా బద్దలు కట్టి మాకు నీ అవసరం ఉందని నెత్తికెత్తుకున్నాడు. బూరు పీకిన కోడిలా మిగిలిన కౌశిక్ వాళ్లకు బంగారు బాతులా కనిపించాడు. రేవంత్‌ను తిట్టించారు. ఎవరూ నమ్మలే. ఏదో ఆడియో లీక్ అయ్యింది. ఉన్న ఇజ్జత్ పోయింది. అయినా కేసీఆర్ పట్టించుకోలేదు. కౌశిక్‌లో ఏదో మహత్యం కనిపించింది. ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు అందరిలో అలా కనిపించడం కామనే అనుకో. తర్వాత గడ్డి పోచలా కూడా కనిపించడు. అది వేరే విషయం. సీన్ కట్ చేస్తే… గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ బెర్త్ ఖరారయ్యింది కౌశిక్‌కు. బుద్ది జీవులందరినీ వదలి… కొత్తగా చేరిన కౌశిక్ ఇవ్వడమేంటని అంతా ముక్కున వేలేసుకున్నారు. మీరు ఏడ వేలేసుకుంటే నాకేంది అనుకున్నాడు కేసీఆర్ షరా మాములుగా.
ఇక గెల్లు శ్రీనివాస్ యాదవ్ విషయానికొస్తే.. అతను లోకల్ కావడం కలిసివచ్చింది. కేటీఆర్‌తో సంబంధాలు నెరపడం మరింత కలిసివచ్చింది. అంతకు మించి…. ఈటల రాజేందర్‌తో పెంచుకున్న వైరం మరింత ఉపయోగపడింది. ఆయన తనను రాజకీయంగా తొక్కేశాడనే ప్రచారాన్ని అధిష్ఠానం వద్దకు తీసుకుపోవడంలో సక్సెసయ్యాడు. ఆటోమెటిక్‌గా కేసీఆర్‌కు, కేటీఆర్‌కు మరింత.. మరింత దగ్గరయ్యాడు. అందుకే అభ్యర్థిగా ఖరారయ్యాడు.
అంతకు ముందు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పెద్దగా ఎవరికీ తెలియదు. తండ్రి చాటు బిడ్డలా ఏదో ఒక ప్రోగ్రాంలో నేతలు పిలిస్తే… పెద్దల అనుమతితో పాల్గొనేవాడు. లౌక్యం తెలిసినవాడు. రాజకీయంగా ఎదగాలనుకున్నవాడు. అందుకే అణిగిమనిగి ఉన్నాడు. అణగదొక్కబడిన వాడిలానే ఉన్నాడు. విధేయుడనిపించుకునేందుకు అజ్ఞాతవాసం కూడా చేశాడు. ఇప్పుడిలా కాలం కలిసివచ్చింది. ఓయూ టీఆర్ఎస్‌వీ ప్రెసిడెంట్‌గా, టీఆర్ఎస్‌వీ స్టేట్ ప్రెసిడెంట్‌గా పనిచేయడం ఇక్కడ గొప్పవిషయం కాదు. కేటీఆర్‌తో విధేయుడనిపించుకునేందుకు ఎంత కష్టపడ్డాడో, ఎంత ఓపికపట్టాడో ముఖ్యం. పైన చెప్పిన కారణాలూ వీటికన్నా ముఖ్యమైనవే. ఇలా ఇవన్నీ కలిసి గెల్లుకు హుజురాబాద్‌ను వరంగా ఇచ్చాయి.
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్న చందంగా.. అన్నీ ఉన్నా ఇలా అదృష్ణం కూడా కలిసి రావాలె. గెలుస్తాడా? ఓడతాడా? తర్వాత విషయం. కానీ ఇప్పుడు మాత్రం అధికార పార్టీ మొత్తం ఆయన కోసం ఇక్కడ పనిచేస్తుంది. కోట్లు గుమ్మరిస్తుంది. గెల్లు మొన్నటి వరకు నిమిత్తమాత్రుడు. ఇప్పుడూ నిమిత్తమాత్రుడే ఎందుకంటే ఆయన గెలుపు కోసం కష్టపడేందుకు వందల శక్తులు మోహరించి ఉన్నాయి.