అతని పేరు కరుణాకర్ దేశాయ్ కేతిరెడ్డి. తెలంగాణ ఉద్యమాలను దగ్గర చూసినవాడు. పాల్గొన్నవాడు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడినవాడు. ఏ పార్టీకి కొమ్ముకాసేదుండదు. తెలంగాణ క్షేమమే ముఖ్యం. ఆత్మాభిమానమే ప్రాణం. ముక్కుసూటిగా మాట్లాడతాడు. తనకు నచ్చింది చెబుతాడు. ఎవరేమనుకున్నా పట్టించుకోడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తెలంగాణే శ్వాసగా బతుకుతున్నవాడు. మహబూబాబాద్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో పుట్టాడు. హైదరాబాద్‌లో నివాసం. తెలంగాణ ఉద్యమకారులందరితో కలిసి నడిచినవాడు. మేథోచర్చల్లో పాల్గొన్నవాడు. కానీ.. ఒక్కసారిగా ఆయన తన వాల్‌పై ఓ పోస్టు దర్శనమిచ్చింది. అంది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిగో ఇదీ ఆ లింక్.(రెండు రాష్ట్రాలు ‘కలవాల’ట.. అలా ఉద్యమం వస్తే తనే ముందుంటాడట… https://vastavam.in/2021/08/07/state-news/p=967/). తెలంగాణ స్వరాష్ట్రం కోసం కొట్లాడిన కేతిరెడ్డి ఇప్పుడు సమైక్య ఉద్యమం వస్తే తానే ముందు వరుసలో ఉంటాననే ఒక్కసారిగా తన వైరాగ్యాన్ని వెలిబుచ్చడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. తను అన్నదానికి ఇంకా కట్టుబడే ఉన్నానంటున్నాడాయన. నా లాగే చాలా మంది ఉద్యమకారులు, ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్ వ్యవహారం, పాలన చూసి విసిగెత్తిపోయారని అంటున్నాడు. ఆయన మనోవేదనను తెలుసుకునే ప్రయత్నం చేసింది వాస్తవం వెబ్‌సైట్. కేతిరెడ్డి ఏమన్నాడంటే….
కేసీఆర్‌ను ఉద్యమ సమయంలోనే మేము నమ్మలేదు. కానీ తెలంగాణ సాధించడం కోసం భుజానికెత్తుకున్నం. కానీ మరీ ఇంతలా నీచ నికృష్ణ రాజకీయాలు చేస్తాడని అస్సలనుకోలేదు. సమైక్య రాష్ట్రంలో నైనా కనీసం తెలంగాణ వాళ్లకు భయపడేది. మాకు అన్యాయం జరిగిందని గొంతెత్తే అవకాశం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. ఉద్యమకారులకు గౌరవం లేదు. ధర్నా చౌక్ లేదు. ఆందోళన చేసే హక్కులూ లేవు
ప్రశ్నించేతత్వం నశించేలా కేసీఆర్ అందరికీ బంగారు సంకెళ్లేసి బిర్యానీ తినిపిస్తున్నాడు. ఇదెంతకాలం సాగుతుందో చూడాలి. మేథావులు మేతావులైపోయారు. చక్రపాణి, అల్లం నారాయణ, గోరెటి వెంకన్న, మల్లెపల్లి లక్ష్మయ్య.. వీళ్లంతా ఎటుపోయిండ్రు? పాశం యాదగిరి ఒక్కడే దెబ్బతిన్న పులిలా తన గొంతుక వినిపిస్తున్నాడు. ఆఖరికి బీఎస్ రాములు కూడా ఇప్పుడు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాడు.
కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేశాడు. బీజేపీ, కాంగ్రెస్‌లలో కోవర్టులను నియమించుకున్నాడు. వారికి నెలా డబ్బులు ఖాతాలో వేస్తాడు. చెప్పినట్టు వినకపోతే అవసరమైతే ఇక్కడ తంతారు. దారికి తెచ్చుకుంటారు. అలాంటి పాలన నడుస్తున్నది.
కేటీఆర్ మీదా తెలంగాణ ప్రజలకు ఆశలేదు. కోదండరామ్ రాజకీయ పార్టీ పెడితే ఫెయిల్ అవుతాడని చెప్పాం వినలేదు. కేసీఆర్ నాయకులను, ప్రజలను కట్టేసి బంగారు పల్లెంలో బిర్యానీ పెట్టే ప్రయత్నం తాత్కాలిక ప్రయోజనాలకే. తెలంగాణలో ప్రేమతో చెబితేనే వింటారు.
కల్లూరి శ్రీనివాస్‌రెడ్డిని నమస్తే తెలంగాణ నుంచి తీసేశారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఆయన ఎంత చేశాడు తెలంగాణకు. కరోనా వస్తే పట్టించుకున్న దిక్కులేదు. సంతోష్ కనీసం స్పందించలేదట.
- దళితబంధు ఎంతమందికని ఇస్తడు. ఇంతకు ముందు చె ప్పిన డబుల్ బెడ్రూంలు, దళితులకు మూడెకరాలు ఇచ్చిండా? ఇదీ అంతే. ఇయ్యనోళ్లంతా శత్రువులే అయితారు కదా. తాత్కాలిక ప్రయోజనాలు కాదు.. దీర్ఘకాలిక ప్రయోజనాలు ముఖ్యం. ఇవన్నీ రాజేందర్ పుణ్యమా అని వచ్చినయి అనుకుంటున్నారు.
కేసీఆర్ మీదున్న వ్యతిరేకతతోనే రేవంత్‌రెడ్డి, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మీటింగులు సక్సెసయ్యాయి. బండి సంజయ్ మాటల మీద నమ్మకం పోయింది. బీజేపీ, టీఆరెస్ తే సంగతులు. తీన్మార్ మల్లన్న వ్యక్తిగా వ్యవస్థను శాసించలేడు. సక్సెస్ కాలేడు. కాంగ్రెస్‌కు ఇంకా అభిమానులున్నారు. అందుకే జెండాలు పట్టుకుని బయటకు వస్తున్నారు.