ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ పేరు చాల మంది వినే ఉంటారు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ప్రభుత్వ పదవిలో ఉంటూ, సర్కారు జీతం తీసుకుంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వేరోస్ పేరుతో ఏకంగా ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకుంటూ పనిచేస్తున్న వ్యవస్థ మీద విధి ధర్మానికి విరుద్ధంగా గూడ చర్యం నడిపిన వ్యక్తి ఇతను. ఇతనొక గోముఖ వ్యాఘ్రంగా పేర్కొనడంతో ఎలాంటి సందేహం అవసరం లేదు. సగటు తెలంగాణ బిడ్డగా, ఒక దళితునిగా నా తెలంగాణ మంచి కోసం ఎలాంటి విషయాన్ని అయినా ప్రస్తావించడానికి నేను సిద్ధం. అందుకే ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఈయన లోని విభిన్న కోణాలను పరిశీలిస్తే కొన్ని విషయాలు మనల్ని షాక్ కు గురిచేస్తాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం.

గతంలో ఈయన మీద అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే అప్పుడు అతను ఒక ప్రభుత్వ అధికారి కాబట్టి. కానీ ఇప్పుడు అతను తన అసలు రూపం బయట పెట్టుకున్నాడు. రాజకీయ నాయకుడిగా కొత్త రూపం ఎత్తుకున్నాడు. ఇక్కడ నేను రాజకీయాల్లో చేరడం తప్పు అని అనడం లేదు. కానీ కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్నట్లు ఈయన ఇటీవల ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు చూసిన తరువాత ఈయన అంటే ఏమిటో నాతో సహా తెలంగాణ ప్రజలకు అర్థం అయిపోయింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో కేసీఆర్ 50 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డాడు అంటూ ఈయన చేసిన ఆరోపణలతో నేను ఆలోచనలో పడ్డాను. కానీ అసలు విషయం ఏమిటంటే మిషన్ కాకతీయకు ప్రభుత్వం పెట్టిన ఖర్చు 8 వేల కోట్లు మరియు మిషన్ భగీరథకు 43 వేల కోట్లు.. మొత్తం కలిపితే 51 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చుపెట్టిందని తెలిసింది. మరి ఈ లెక్కన 50 వేల కోట్ల అవినీతికి ఆస్కారమెక్కడున్నది ? అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒక చదువుకున్న వ్యక్తిగా కాకుండా ఒక చిల్లర రాజకీయ నాయకుడిగా దిగజారాడు అన్నది సుస్పష్టం. ఇది ప్రజలను తప్పుడు సమాచరంతో మభ్యపెట్టే యత్నం.

ఒక పోలీసు అధికారిగా ఈయన ప్రస్థానాన్ని గమనిస్తే ఎవరికైనా చెమటలు పట్టక మానవు. ఉద్యమం పేరుతో అడవి బాట పట్టిన అనేక మంది అమాయక బిడ్డలను పాయింట్ బ్లాంక్ రేంజి నుండి ఎన్ కౌంటర్ చేసిన చరిత్ర ఈ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిది. తెలంగాణ అంటేనే సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈయన చేసిన నెత్తుటి మరకలు ఎంతోమంది తల్లులకు గర్భ శోకాన్ని మిగిల్చాయి. ఈరోజు ఈ వ్యక్తిని సమర్థిస్తున్న కొంతమంది హక్కుల కార్యకర్తలు, మేధావులకు ఈ విషయం సుపరిచితమే.

అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ ప్రభుత్వం ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ సేవలు వేరే విధంగా ఉపయోగించుకున్నది. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ళకు సంబందించి సెక్రటరీగా భాద్యతను అప్పజెప్పింది. సమైక్య రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అన్ని వర్గాల బిడ్డలకు నాణ్యమైన విద్య అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డల కోసం సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడక ముందు నాణ్యమైన విద్య బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందని ద్రాక్ష. సమైక్య రాష్ట్రంలో బీసీలకు కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవి. స్వరాష్ట్రంలో కొత్తగా 261 రెసిడెన్షియల్ స్కూళ్లు, మైనారిటీ 206 గురుకులాలు, ఎస్సీలకు 134 గురుకులాలు (104 రెసిడెన్షియల్ పాఠశాలలు, 30 డిగ్రీ కాలేజీలు), ఎస్టీల కోసం 51 గురుకులాలు ప్రారంభించడం జరిగింది. వాటి నిర్వహణ భాద్యతలు చేపట్టిన తరువాత ఈయనలోని అసలువ్యక్తి బయటకు రావడం ప్రారంభించాడు. తన స్వార్థం కోసం విద్యార్థులను పావులుగా వాడుకున్నాడు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ.. తానూ ముందుగానే ఏర్పరుచుకున్న ప్రణాళిక ప్రకారం విద్యార్థులను తప్పుదోవ పట్టించడం మొదలుపెట్టాడు.

ఈయన విధానాలు నచ్చిన వారు, ఈయనకు నచ్చని ఎంతోమంది ఉపాధ్యాయులను, మహిళలను, సిబ్బందిని ఈయన వేధించడం జరిగింది. స్వేరోస్ పేరుతొ తెలంగాణ ప్రభుత్వం మీద విషం చిమ్మడానికి అమాయక బిడ్డల జీవితాలను సమిధలుగా మార్చడానికి తెగబడ్డాడు. సెక్రటరీగా తన పదవీకాలం ముగుస్తుండటంతో తిరిగి పోలీసు విధుల్లో చేరేందుకు చేతగాక ముందస్తు పదవీ విరమణకు దరఖాస్తుచేసుకోవడం జరిగింది. దళిత, బహుజనులను ఉద్దరించడానికి ఆకాశం మీది నుండి ఊడిపడ్డట్లు బౌద్ధ మతం స్వీకరించానని చెప్పుకుంటూ ప్రవచనాలు వల్లిస్తున్నాడు. ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. అయితే ఇక్కడే నాకొక సందేహం వచ్చింది. నిజంగా ఈయనకు దళితుల పట్ల నిజమైన ప్రేమ ఉండి ఉంటే దేశంలో దళితుల పట్ల జరుగుతున్న వివక్ష గురించి ఎందుకు మాట్లాడటం లేదు. కేవలం అగ్రవర్ణాలకే కొమ్ము కాసే బీజేపీ విషయంలో ఒక్కసారి కూడా నోరు ఎత్తకపోవడానికి కారణం ఏమిటి ? బీజేపీ పట్ల ఈయన సానుకూల, మెతక వైఖరికి కారణం ఏమిటి ? దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలి.

మరోవైపు ఈయన తీర్థం పుచ్చుకున్న బహుజన సమాజ్ పార్టీ.. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఒక మతతత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీతో ఈరోజు మాయావతి గారు కలిసి పనిచేయడానికి సిద్దమవుతున్న తరుణంలో ఏ రకంగా ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కోసం పనిచేస్తాడో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈయన తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న విమర్శలు చూస్తూ ఉంటే ఈయన వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారో రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఈయన చెబుతున్న నీతులు, చేస్తున్న పనులకు అస్సలు పొంతన లేదు. అంతేకాదు రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తిన తరువాత ఈయన చేస్తున్న విమర్శలను సోషల్ మీడియాలో కొంతమంది ఆధారాలతో సహా బయటపెట్టి తిప్పికొట్టడం జరిగింది. అలాంటి వారి మీద తాను తయారు చేసుకున్న ప్రైవేట్ సైన్యంతో సోషల్ మీడియా వేదికగా బూతులు తిట్టిపిస్తూ దాడి చేపించడం జరుగుతోంది. ఇంకో అడుగు ముందుకు వేసి అలా తనను విమర్శించిన వారిని బూతులు తిట్టిన వారి కామెంట్లను సమర్థిస్తూ లైకులు కొట్టడం ఈయన లోని అసలు రూపాన్ని బయటపెట్టింది.

బహుజనవాదాన్ని, డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకుంటూ ఈయన వేస్తున్న వేషాలు ప్రజలు గమనించడం లేదనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి ఉండదు. నువ్వు ప్రశ్నిస్తానని పక్కోడి జెండా, ఎజెండా మోడయాడానికి సిద్ధమైనప్పుడు, నిన్ను ప్రశ్నించే హక్కు నాలాంటి వారికి ఎందుకుండదు ? ప్రభుత్వ ఉద్యోగిగా నువ్వు నిజంగా ఉద్దరించావని అనుకున్నా అది నీ విధి ధర్మం. ఎందుకంటే నువ్వు జీతం తీసుకుంటున్నావు కాబట్టి. నీలాంటి ఆఫీసర్లు రాష్ట్రంలో వందల సంఖ్యలో తమ భాద్యతలను నిర్వర్తిస్తున్నారు. కానీ నీలాగా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పరుచుకొని, ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసే కుట్రలు చేయడం లేదు. ఆ విషయం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి గుర్తు పెట్టుకుంటే మంచిది.

తెలంగాణ ప్రజలారా .. అప్రమత్తంగా ఉండండి. ఇది నేను ఏ ఒక్కరినో సమర్దించి రాయడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణ రాష్ట్రాన్ని శాంతి భద్రతలను అస్థిర పరచడానికి, తెలంగాణ ను తెర్లు చేయడానికి అనేకమంది గోతి కాడి నక్కల్లా వేచి చూస్తున్నారు. అలాంటి వ్యక్తుల చేతిలో కీలు బొమ్మ ఈ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి. గతంలో ఈయన హిందూ దేవతలను దూషిస్తూ.. అవమాన పరిచేలా మాట్లాడి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడం జరిగింది. ఈ విషయం మన అందరికీ తెలుసు. ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతొ చిచ్చుపెట్టి తద్వారా తెలంగాణలో అలజడి సృష్టించడానికి పన్నిన పన్నాగం ప్రభుత్వ అప్రమత్తతతో విఫలమైంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఇంకా ప్రజలను రెచ్చగొట్టే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటం తెలంగాణ ప్రజలుగా మన కనీస బాధ్యత అని చెప్పక తప్పదు.
జర భద్రం!!

– ఒక రీసెర్చ్ స్కాలర్
పాలమూరు యూనివర్సిటీ

You missed