సర్పంచుకు గాలమేసీ తనే ఆ వలలో చిక్కుకుంది ఓ మాయలేడీ. తన అందచందాలతో లీడర్లను, పెద్ద భూస్వాములను మొదట వలలో వేసుకుని వెంటనే బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతుంది. తనకు ఆస్తిలో వాటా కావాలని పెద్దమొత్తాన్నే డిమాండ్ చేస్తుంది. వినకపోతే పోలీస్ కేసు పెడతానని, పరువు బజారుకు ఈడుస్తానని కచ్చాడాగులు వేస్తుంది. ఈ మాయలేడీ బెదిరింపు మాటలకు బెదిరిపోని వారుండరు. పరువుకు భయపడి కాళ్లబేరానికి రావాల్సిందే ఏ మగాడైనా.
అలా తన కళతో రాణిస్తూ.. ఎక్కడా బయటపడకుండా యధేచ్చగా దందాను కొనసాగుతున్నది. ఈ మాయలేడీ కథ కామారెడ్డిలో అడ్డం తిరిగింది. తను వేసిన వలలో జింక చిక్కినట్లే చిక్కి చివరి నిమిషంలో తప్పించుకుంది. కానీ ఆ ఉచ్చులో ఆ మాయలేడే ఇరుక్కోవడం ఈ కథలో ట్వీస్ట్.
గాంధారి మండలంలోని ఓ గ్రామ సర్పంచును బుట్టలో వేసుకుంది ఈ మాయలేడీ. కామారెడ్డిలో ఆ సర్పంచ్‌కు ఓ ఇల్లుంది. ఆ ఇంట్లో కిరాయికీ దిగింది ఈ లేడీ. ఆ సర్పంచ్‌ను లోబర్చుకుంది. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది. ఆస్తిలో వాటా ఆడిగింది.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జోక్యంతో ఓ సెటిల్మెంట్ కుదిరింది. అనుకున్నది జరిగినందుకు సంతోషించిన మాయలేడీ కేసు విత్‌డ్రా చేసుకోవడానికి వెళ్లింది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి కేసును విత్‌డ్రా చేయలేదు. కేసు పెట్టడం నీవంతే.. విత్‌డ్రా చేసుకోవడం నీ ఇష్టమేనా అని ససేమిరా అన్నది. దీనిపై లోతుగా విచారణ జరుగుతున్నది. ఈ మాయలేడీ కథలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. వీటిని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.