హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధం అవుతోంది. ఇక ఈ ఎన్నిక‌ను ఆల‌స్యం చేయాల‌నుకోవ‌డం లేదు కేంద్రం. అమిత్ షా ఈ ఎన్నిక‌పై ప్ర‌త్యేక న‌జ‌ర్ పెట్టాడు. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ గ్రానైట్ కంపెనీల‌కు ఈడీ నోటీసుల జారీతో త‌న రంగ‌ప్ర‌వేశాన్ని ప‌రోక్షంగా వెల్ల‌డించాడు. కాగా నోటిఫికేష‌న్‌ను ఈ వారం రోజుల్లోగా విడుదల చేయ‌నున్నారు. దీంతో హుజురాబాద్ రాజ‌కీయాలు మ‌రింత హాట్ హాట్ గా మారుతున్నాయి. కాగా సీఎం కేసీఆర్ ఈరోజు వాసాల మ‌ర్రికి ప‌ర్య‌ట‌న వెళ్లి రేప‌ట్నుంచి ద‌ళిత‌బంధు అమ‌లులోకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించేశాడు. అర్హులైన ద‌ళితుల‌ ఖాతాల్లో రేప‌ట్నుంచి ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు ప‌డ‌తాయ‌ని వెల్ల‌డించాడు. దీంతో ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు రంగం రెడీ అయ్యింద‌ని తేలిపోయింది. టీఆరెస్, బీజేపీల బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు హుజురాబాద్ వేదిక కానుంది.

నువ్వా నేనా అనే రేంజ్‌లో ఇరు పార్టీలు త‌ల‌ప‌డనున్నాయి. ఈట‌ల రాజేంద‌ర్‌కు అక్క‌డ బ‌లమైన నాయ‌కుడు కావ‌డంతో అత‌న్ని ఢీ కొట్టేందుకు కేసీఆరే స్వ‌యంగా రంగంలోకి దిగాడు. అక్క‌డికే ప‌రిమితం చేసినా.. ప‌డ‌కేసిన ప‌థ‌కాల‌ను ప‌రుగులు పెట్టించాడు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌కు మోక్షం ల‌భిస్తున్న‌ది. ఒక్కొక్క‌టిగా హామీల‌ అమ‌లుకు సాకారం ల‌భిస్తున్న‌ది. ఎన్నిక‌లైపోయాక‌.. అవి వెంట‌నే అమ‌ల‌వుతాయా? వ‌చ్చిన ఫ‌లితాల మీద ఆధార‌ప‌డి ఉంటుందా? తెలియ‌దు. ఇక రేప‌టి నుంచి పోరుకు రెడీకానున్నారు. టీఆరెస్ అభ్య‌ర్థిగా దాదాపు గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను ఓకే చేసేలా ఉన్నారు. దీనిపైనా ఈరోజు క్లారిటీ రానున్న‌ది. ఇక హుజురాబాద్ క‌ద‌న రంగం తాడోపేడో తేల్చుకునేందుకు వేదిక కాబోతున్న‌ది. యావ‌త్ రాష్ట్రం ఇప్పుడు ఇక్క‌డే ఫోక‌స్ పెట్టింది.

ఎట్లాగూ నోటిఫికేష‌న్ డేట్ సీఎంకు తెలిసిపోయింది కాబ‌ట్టి. ఆలోగా ఇక మ‌రిన్ని వ‌రాల వాన కురిపించ‌నున్నాడు. ప‌లువురికి ప‌ద‌వులు వ‌రించ‌నున్నాయి. అగ్ర‌నేత‌లు రంగంలోకి దిగ‌నున్నారు. వ్యూహాల‌కు మ‌రింత ప‌ద‌ను పెర‌గ‌నుంది. మాట‌ల దాడుల‌కు సోష‌ల్ మీడియా వేదిక కానుంది. క‌ద‌న రంగంలో ప్ర‌చారం హోర‌త్త‌నుంది.

You missed