హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయా? ప‌రిస్థితి ఏంటి? అనే విష‌యాల పై కేసీఆర్ న‌జ‌ర్ పెట్టాడు. భారీ బ‌హిరంగ స‌భ‌ల‌కు స‌మాయ‌త్త‌మ‌వుతున్న అధికార పార్టీ ఇప్ప‌టికే ప‌లు విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్న‌ది. క‌రోనా కేసులు పెరిగితే దానికి ఎవ‌రూ బాధ్య‌త అని అధికార పార్టీని నిల‌దీసే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. దీంతో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా, స‌ర్కార్ బ‌ద్నామ్ కాకుండా వైద్య బృందాల‌ను అక్క‌డ దింపాడు.

గురువారం కరోనా పరిస్థితులపై వైద్య శాఖ పరిశీలించింది. జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాసరావు సందర్శించాడు. ఇక్క‌డ కేసులు పెరుగుతున్నాయ‌నే విష‌యాన్ని ఆయ‌న గుర్తించాడు. పూర్తి స్థాయిలో అంద‌రికీ వ్యాక్సిన్లు వేయాల‌నే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఈట‌ల రాజేంద‌ర్ త్వ‌ర‌లో పాద‌యాత్ర ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ రాజ‌కీయ సంద‌డి ఇక్క‌డ మొద‌లుకానుంది. ఎన్నిక‌ల షెడ్యూల్ కూడా త్వ‌ర‌లో వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం సైతం ఇక్క‌డ ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని వేగ‌వంతం చేయ‌నుంది. ఈ సంద‌ర్భంలోనే థర్డ్‌వేవ్ పై వ‌స్తున్న ప్ర‌చారాలు, అపోహ‌లు ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి. కేసులు పెరిగితే అవి ప్ర‌భుత్వానికి మ‌చ్చ‌లా మారుతుంద‌ని కేసీఆర్ భావిస్తున్నాడు. ల‌క్ష మందితో బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి ద‌ళిత‌బంధును లాంఛ‌నంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం త‌ర‌పున తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌న్నీ తీసుకుంటే న‌ష్టం పెద్ద‌గా జ‌ర‌గ‌ద‌నే ముందు చూపుతో కేసీఆర్ ఉన్నాడు.