హుజురాబాద్ ఎన్నికలు ఒక్క నియోజవర్గానికే పరిమితం కావడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా ఈ ఉప ఎన్నికలో విజయానికి విపరీతమైన చెమటోడుస్తున్నాడు. ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ఇది బీజేపీ, టీఆరెఎస్‌ల మధ్య ప్రధాన యుద్ధంగా మారింది. ఈ గెలుపే రెండు పార్టీల భవిష్యత్తుకు నాంది అనే విధంగా రాజకీయాలు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. తాజాగా మంత్రి గంగుల కమలాకర్‌కు సంబంధించిన గ్రానైట్ కంపెనీల పై ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయ కలకలానికి తెరతీసింది.
అధికార పార్టీ ఈటలను ఓడించేందుకు వందలాది శక్తులను మోహరించి పెట్టింది. నిర్భందం పెరిగింది. అధికార దుర్వినియోగం కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఈటల ఒంటరయ్యాడు. అన్ని శక్తుల ఒక్కసారిగా దాడి చేయడంతో మానసికంగా, శారీరకంగా ఆయన పై దెబ్బ పడింది. అయినా అధికార పార్టీ వదలడం లేదు. ఉచ్చు బిగుస్తూ వస్తుంది. ఈ క్రమంలో బీజేపీ తనదైన పొలిటికల్ మార్క్‌కు తెరతీసింది.
మొదటి నుంచి తెలంగాణ రాజకీయాల పై అమిత్ షా నజర్ పెట్టాడు. ఈ సారి కచ్చితంగా అధికారంలోకి రావాలనే ఆలోచనతో వ్యూహాలు రచిస్తున్నాడు. స్టేట్ బీజేపీలో ఇంకా అమిత్ షా మార్క్ రాజకీయాలు మొదలు కాలేదు. గంగులకు ఇచ్చిన ఈడీ షాక్‌తో ఇది నాంది పలికినట్లయింది. అధికార పార్టీ దూకుడికి ఈ పరిణామం బ్రేక్ వేసింది.
గంగుల కమలాకర్ కంపెనీలకు ఈడీ నోటీసులిచ్చినా ఇది ఒక రకంగా కేసీఆర్‌కూ వార్నింగ్ ఇవ్వడం లాంటిదే. మితిమీరిన అత్యుత్సాహం చూపితే కర్రుకాల్చి వాత పెట్టేందుకు మేము రెడీగా ఉన్నామనే సంకేతాలు కేంద్రం ఇచ్చినట్లయింది. మొన్నటి వరకు దూకుడు మీద కనిపించిన టీఆరెఎస్ పార్టీ నేతలకు ఈ పరిణామం మింగుడు పడడం లేదు.
గంగుల కమలాకర్ ఉదంతాన్ని ముందు పెట్టుకొని కేసీఆర్‌ను అమిత్‌షా ప్రత్యక్షంగా, పరోక్షంగా హెచ్చరించినట్లుగా దీన్ని అర్ధం చేసుకోవచ్చు. ఇంకా మున్ముందు ఈ ఎన్నికలు ముగిసే నాటికి అమిత్ షా తన శక్తియుక్తులు, మంత్ర తంత్రాలు ఎన్ని ఉపయోగిస్తాడో? వీటిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటాడో? ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక యుద్ధం ఈటలకు, త్వరలో ప్రకటించబోయే టీఆరెఎస్ అభ్యర్థికి మధ్య కాదు.. అమిత్‌షాకు, కేసీఆర్‌కు మధ్య యుద్ధం.