పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలనుకోవడం వృథాయేనని అనిపిస్తుంది చాలా సార్లు. ఎవరెన్ని చెప్పినా.. ఎవరెన్ని చేసినా.. అవి పాలక పక్షాల కనుసన్నల్లోనే నడుస్తాయి. పాలకులెవరుంటే వారి పాటే పాడతాయి. తెలంగాణ వచ్చిన తర్వాత పోలీసుల శాఖకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చాడు కేసీఆర్. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో కొత్త మార్పు తీసుకురావాలనుకున్నాడు. కొత్త వాహనాలైతే వచ్చాయి కానీ.. అవే పాత మైండ్ సెట్‌తోనే పనిచేస్తున్నారు ఖాకీలు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలంటేనే జంకే పరిస్థితి ఇంకా అలాగే ఉంది. ఏం మారలేదు. మరింతగా చెలరేగిపోతున్నారు కూడా కొందరు. అధికార నేతల అండ చూసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
చాలా కేసుల్లో పోలీసుల ఆగడాలు బయటకు రావు. ఖాకీలంటే భయం. బాధితులు బయటకు చెప్పుకోలేరు. ప్రతీ పోలీసోడి వెనుక ఓ లీడరుంటాడు. అతను అధికార పార్టీకి చెందిన వాడై ఉంటాడు. అలా ఆ అధికారపార్టీ లీడర్ సపోర్టు లేకపోతే.. అక్కడ ఆ ఖాకీ ఎక్కువ కాలం కొనసాగలేదు. చెప్పింది వినాలి అంతే. మరి ఆయన చెప్పింది వింటే ఇక ఢోకాలేదు కదా… అందుకే ఆ ఖాకీ రెచ్చిపోతాడు. ఆ ఇలాకాకీ నేనే కింగ్‌నంటాడు. అధికార పార్టీ లీడర్లు తప్ప ఎవరొచ్చినా డోంట్ కేర్ అంటాడు. ఇక జనాల సంగతి సపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు.
ట్రైనీ ఎస్సైపై అత్యాచారయత్నం కేసులో మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్సై శ్రీనివాసరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఆయనపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసులు కూడా నమోదు చేశారు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్. కొన్ని రోజులకు మరిచిపోతారు. షరా మామూలే అనుకుంటారు. కానీ ట్రైనీ ఎస్సైకే ఈ దుర్గతి పడితే ఇక సామన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది? వారిపై ఈ ఖాకీల బలప్రయోగాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. చాలా కేసులు బయటకు రావు. లోలోన అణుచుకుంటారు. అదే కొందరి ఖాకీలు మరింత రెచ్చిపోవడానికి ప్రధాన కారణం. ఏ సంఘనలూ బయటకు రాలేదు కాబట్టి ఫలానా పోలీస్ స్టేషన్ సూపర్… ఫలానా ఎస్సై బాగా పనిచేస్తున్నాడని కాదు అర్ధం. కొన్ని బయటకు రావంతే. ఫ్రెండ్లీ పోలీసింగ్ ట్యాగ్ లైన్ కింద నలిగిపోతాయి. అంతే.