కరోనా భయం ఇంకా జనాలను వెంటాడుతూనే ఉన్నది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నదనే వార్తలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. ఇప్పటికైతే జంకు లేకుండానే బయట జనం తిరుగుతున్నారు. రోజువారీ పనులు చేసుకుంటున్నారు. ఇంకా పరిస్థితులు పూర్తిగా సెట్‌కాలేదు. కొందరు మూతికి మాస్క్ లేకుండానే తిరుగుతున్నారు. మార్కెట్ మాత్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. థర్డ్ వేవ్ భయం వెంటాడుతూనే ఉంది. హైదరబాద్‌లో మూత బడిన ఫ్యాక్టరీలు ఇంకా పూర్తిగా తమ పనిని మొదలుపెట్టలేదు. తమ ఊళ్లకు వెళ్లిపోయిన వలస కూలీలకు ఇంకా హైదరాబాద్ మీద నమ్మకం కుదరలేదు. వాళ్లింకా రాలేదు. రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదు. లిక్విడ్ క్యాష్ బయటకు తీసేందుకు భయపడుతున్నారు. థర్డ్ వేవ్‌తో ఇంటికే పరిమితమైతే డబ్బు సమస్య ఉత్పన్నమవుతుందనే భావనలో ఉన్నారు. ఎక్కడి క్యాష్ అక్కడ ప్యాక్ అయ్యింది.
ఇగో కేసులు.. అగో కేసులు అంటూ భయపెట్టి చంపే గ్యాంగ్ అప్పుడే బయలుదేరింది. హైదరబాద్ గాంధీ దవఖానలో కరోనా వార్డు మొత్తం నిండిపోయిందని పుకార్లు లేచాయి. కొందరు ఆగస్టులో థర్డ్ వేవ్ చుట్టుముడుతుందని భయపడతున్నారు. ఇంకొందరు సెప్టెంబర్ కరోనా రెచ్చిపోతుందని భయపెడుతున్నారు. ఎవరికి వారే అంచనాలు వేసుకుంటూ భయం గుప్పిట్లో బతుకున్నారు. నిర్మాణ రంగంలో కొంత కదలిక వచ్చినా.. అందరికీ పనులు కల్పించే విధంగా ఈ రంగం ఇంకా కోలుకోలేదు. పనులు లేక అల్లాడే పరిస్థితి వచ్చింది. కరోనా ఉన్న సమయంలో పనులు లేవు.. బతికుంటే చాలు అని ఇండ్లకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు కరోనా భయం లేకున్నా.. యథేచ్చగా తిరుగుతున్నా పరిస్థితులు ఇంకా సెట్ కాకపోవడంతో బడ్జెట్ ఇంకా అలాగే తలకిందులుగానే ఉంది. అప్పులు కూడా పుట్టని దుస్థితి ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే .. ఇక థర్డ్ వేవ్ రంగ ప్రవేశం చేస్తే … మార్కెట్ మొత్తం దివాళ తీసి.. ఎప్పట్లోనే మళ్లీ యథాతధ స్థితి వస్తుందో తెలియని గందరగోళం, అయోమయంలో ప్రజలున్నారు.
