హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్ధి ఎవరినే దానిపై ఓ వైపు ఉత్కంఠ కొనసాగుతుండగా మరోవైపు కేసీఆర్ ఆలోచనలు ఎటు వైపు సాగుతున్నాయనే అంచనాలను బేరీజు చేసుకునేందుకు ఎవరికి వారే తమకు తోచిన విశ్లేషణ చేస్తూ వస్తున్నారు. కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పటికీ అతనికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. తాజాగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ దాదాపు ఖరారు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధిగా, ఉద్యమకారుడిగా, బీసీగా ఉన్న గెల్లును నిలబెడితే ఈటలకు ధీటుగా పోటీ ఇచ్చి గెలవచ్చని కేసీఆర్ భావిస్తున్నడు. ఈటల ఉద్యమకారుడిగా తనను తాను ప్రజల వద్ద ప్రొజెక్ట్ చేసుకుంటూ, సానుభూతిని కూడగట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. పాదయాత్ర ద్వారా జనాలతో మమేకమై ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఓయూ మంత్రాన్ని ప్రయోగించడం ద్వారా లాభం జరగవచ్చునని కేసీఆర్ భావిస్తున్నాడు. ఉద్యమకారుడిగా పలు కేసులు కూడా నమోదై జైలుకు వెళ్లి వచ్చిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉంటే బీసీ ఓట్లు కూడా రావచ్చుననే అంచనాలున్నాయి. ఇప్పటికే దళితబంధు ఇక్కడే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీలంతా తమ వైపే ఉంటారని కేసీఆర్ అనుకుంటున్నాడు. పార్టీ అవసరాలను గుర్తించి ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అప్పటికప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని, ఎవరికి అంతుచిక్కకుండా వ్యూహాన్ని పకడ్భందీగా అమలు చేయడంతో కేసీఆర్ దిట్ట. ఈటలను ఎలాగైనా మట్టికరిపించాలనే ధ్యేయంతో కేసీఆర్ పకడ్భందీ వ్యూహ రచన చేస్తున్నాడు. ఉద్యమ సమయంలో తప్ప ఓయూ మాటెత్తని కేసీఆర్… హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా గెల్లు శ్రీనివాస్ అభ్యర్థిత్వం ద్వారా ఓయూ సెంటిమెంట్‌ను వాడుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల పై చిలుకు ఓట్లు ఉండగా మెజార్టీ ఓట్లు ఎస్సీలవే. ఆ తరువాత ముదిరాజ్ ఓట్లు, యాదవుల ఓట్లు, రెడ్డిల ఓట్లు ఉన్నాయి. ఓయూ స్టూడెంట్, ఉద్యమకారుడు, బీసీ నేత అయిన గెల్లును బరిలో ఉంచి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న కేసీఆర్ వ్యూహాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
