(శ్రీ‌నివాస్ దండుగుల‌)

కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రం. కొత్త పాల‌న‌. అంతా కొత్త కొత్త‌. ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎంత అణిగిమ‌నిగి ఉండాలి. ప్ర‌జ‌ల‌కు సేవ చేసుకునే అవ‌కాశాన్ని ఎంత బాగా స‌ద్వినియోగం చేసుకోవాలి. కానీ రాష్ట్రంలో ఇప్పుడు జ‌రుగుతున్న‌దేంది? తొలిగా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడు కొంత న‌యం. ఇప్పుడైతే మ‌రీ నోటికి అడ్డు లేకుండా పోతుంది. అధికార ద‌ర్పం హ‌ద్దులు దాటుతున్న‌ది. ప్ర‌చార యావ పీక్‌కు చేరుకుంటున్న‌ది. ఉద్యమంలోంచి వ‌చ్చిన‌వాడూ అంతే… తేర‌గా వ‌చ్చిన చేరిన వాడూ అంతే అన్న‌ట్లుగా త‌యార‌య్యింది. కీర్త‌న‌ల‌తో క‌రిగిపోవాల‌నే త‌ప‌న పెరిగిపోతున్న‌ది. పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తితే త‌డిచి త‌న్మ‌యం చెందడం అల‌వాటుగా మార్చుకున్నారు. ప్ర‌శ్నిస్తే చికాకు. ఎదురు తిరిగితే ప్ర‌ష్టేష‌న్. మాకే ఎదురు మాట్లాడేంత మొన‌గాళ్లా అనే రీతిలో మిడిసిపాటు. ఏమీ లేని విస్త‌రి ఎగెరెగిరి ప‌డ్డ‌ట్టే. రోడ్డుకిరువైపులా ఎండ‌లో చేతులెత్తి దండం పెడుతూ గంట‌ల త‌ర‌బ‌డి నిల‌బ‌డితే దానికి మ‌న‌వాళ్లు ముద్దుగా పెట్టుకున్న పేరు ధ‌న్య‌వాదాలు తెలిపేందుక‌ని. మీరున్న‌దే ప్ర‌జాసేవ చేసేందుకే. మీకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపాలా. దాన్ని ఓ మంత్రి గ‌ర్వంగా ఫేస్ బుక్కులో పోస్ట్ చేసి త‌న ప‌రిప‌క్వ‌త‌ను చాటుకుంటాడు. అప్పుడే ధాన్యం కొనేది లేద‌ని సీఎం ప్ర‌క‌టిస్తాడు. మళ్లీ కొనుగోలు చేస్తున్నామంటే మీరంతా మాకు రుణ‌ప‌డి ఉండాల‌నే బిల్డ‌ప్ వ‌స్తుంది ప్ర‌భుత్వం నుంచి. ధాన్యం కొనుగోల కేంద్రాల వ‌ద్ద హ‌మాలి ప‌ని క‌ల్పించామ‌ని, ఉద్యోగాలు క‌ల్పించామ‌ని చాలా గొప్ప‌గా చెప్పుకొని త‌న ప‌రిణ‌తి చాటుకుంటాడు మ‌రో మంత్రి. ఇంకొక‌డు క‌లెక్ట‌ర్‌తో కుర్చీలు తెప్పిస్తాడు. అల‌వాటులో పొర‌పాటుగా మ‌హిళ‌ల‌తో మీటింగుల‌లో కూడా అస‌భ్యంగా మాట్లాడ‌తాడు. మీడియా వ‌క్రీక‌ర‌ణ‌లంటారు. కాళ్లు మొక్కి క్ష‌మాపణ చెప్పాడ‌ని స‌మ‌ర్థించుకుంటారే త‌ప్ప‌…హ‌మాలి ప‌నిని కూడా ఉద్యోగాలు క‌ల్పించామ‌నే దొరహంకారాన్ని మాత్రం అంగీక‌రించ‌డు. జ‌న్మ‌దినాల‌కు కోట్లాది మొక్క‌లు నాటాల‌నే సంక్ప‌లం … ఇదీ ఇప్పుడు ఉద్య‌మ స్పూర్తి.

You missed