హరీశ్‌రావు… ఓ ట్రబుల్ షూటర్. కష్ట కాలంలో పార్టీని గట్టెక్కించే తెలివి తేటలు, చాతుర్యం ఉన్న నేత. కేసీఆర్ కు పార్టీ ఆపత్కాలంలో ఉందనగానే టక్కున గుర్తొచ్చే నాయకుడు హరీశ్ రావు. ఏదైనా పని అప్పగిస్తే, బాధ్యత భూజానికెత్తితే అవిశ్రాంతంగా పోరాడి విజయుడై తిరిగి రావడం హరీశ్ రావు స్టైల్. పార్టీని విజయతీరాలకు తీసుకురావడం ఆయనకు ‘ఉద్యమంతో పెట్టిన విద్య’. కానీ దుబ్బాక ఫలితాలు హరీశ్ అంచెంచల విశ్వాసం పై దెబ్బకొట్టాయి. తను నమ్ముకున్న శక్తియుక్తులను సన్నగిల్లేలా చేశాయి.
ఒంటరి పోరులో ఒంటి చేత్తో వన్ మెన్ ఆర్మీలా సక్సెస్‌ను చంకనెత్తుకొని రాగలిగే సత్తా ఉన్న హరీశ్ .. దుబ్బాకలో బొక్కబోర్లా పడ్డాడు. ఫలితాలు అంచనాకు చిక్కలేదు. ఒంటరయ్యాడు. విజయం సంభవిస్తే కీర్తించే ఆ నోళ్లే హరీశ్‌ను హేళన చేశాయి. వెక్కిరించాయి. కానీ హరీశ్ శక్తియుక్తుల పై కేసీఆర్‌కు అపార నమ్మకం ఇంచుక మాత్రం కూడా సడలలేదు. ఇప్పుడు పార్టీ ట్రబుల్‌లో ఉంది. అందుకే కేసీఆర్‌కు ‘ట్రబుల్ షూటర్’ గుర్తొచ్చాడు. హుజురాబాద్‌కు ఇంచార్జీ బాధ్యతలు అప్పగించాడు.
పార్టీని విజయతీరాలకు తీసుకుపోవాలని ఆదేశించాడు. బాస్ ఆదేశమే తరువాయి.. రంగంలో దిగి జూలు విదిలించాడు హరీశ్. ఎన్ని శక్తులను పార్టీలో విలీనం చేసుకున్నా, ఎంత మం
దికి పదవులిచ్చి ఈటల పై ఊసుగొల్పినా.. కేసీఆర్‌కు మాత్రం ఇంకా నమ్మకం కలగలేదు. ఓ వ్యూహరచన చేసే నాయకుడు కావాలి. శక్తులన్నింటినీ ఏకం చేసి శత్రువు మీద దాడి చేసే కెప్టెన్ కావాలి. అది హరీశ్‌తోనే సాధ్యం. కేసీఆర్‌కు అదే గురి. అదే నమ్మకం. హరీశ్‌కు బాధ్యతలు అప్పగించి తెర ముందు ‘హుజురాబాద్ సినిమా’ చూస్తున్నాడు కేసీఆర్. తెర వెనుక వ్యూహరచనలో తలమునకలై ఉన్నాడు హరీశ్. కానీ ఏదో వెలితి. ఇంకేదో సందేహం. మరేదో అనుమానం.
దుబ్బాక ఫలితాల గుణపాఠాలు ఆయన కళ్ల ముందున్నాయి. గుణపాఠాల నుంచి పాఠాలు నేర్చుకునే నేతలు అరుదు. లోపాలను గుర్తెరిగి ఆయుధాలుగా మలుచుకునే నాయకులు బహు అరుదు. కానీ హరీశ్ దుబ్బాక నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. ఆ పాఠాల ఫలితాలను హుజురాబాద్‌లో ప్రయోగించేందుకు
సిద్ధమయ్యాడు.
ప్రతిపక్షం బలమేదో గ్రహించాడు. పాలకపక్షం బలహీనతనూ ఒప్పుకున్నాడు. అందుకే సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నాడు. ఉద్యమ కాలం నుంచి ఎన్నో ఎన్నికలను చవిచూసిన హరీశ్‌రావు ప్రతి ఎన్నిక ద్వారా ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు హుజురాబాద్‌లో తన అనుభవాల, దుబ్బాక గుణపాఠాల నుంచి నేర్చుకున్న వ్యూహరచన పాఠాలను ప్రయోగించనున్నాడు. సక్సెస్ అవుతడా? సాధిస్తాడా? చతికిలబడతాడా? హుజురాబాద్ నుంచి మరో పాఠం నేర్చుకోనున్నాడా?
