ప‌థ‌కాల అమ‌లులో గొప్ప‌లు చెప్ప‌కుంటూ దేశంలో మేమే నంబ‌ర్ వన్ అని అనిపించుకునేందుకు తంటాలు.. త‌ప‌త్రాయాలు ప‌డే కేసీఆర్.. ఆ ప‌థ‌కాల‌కు కావాల్సిన నిధులు విడుద‌ల చేయ‌లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నాడు. కానీ ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్కనీయ‌డం లేదు. చాలా తేలివిగా స‌మాచారాన్ని మేనేజ్ చేస్తూ మీడియాను గుప్పెట్లో పెట్టుకొని ఈ ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌కు తెలియ‌నివ్వ‌కుండా కాపాడే క్ర‌మంలో స‌క్సెస్ అవుతున్నాడు.

త‌ను ఎక్క‌డా ఫెయిల్ అయిన‌ట్లు క‌నిపించ‌కూడ‌దు. అంతా ఎప్ప‌టికీ ఆహా, ఓహో అని కీర్తించాలి. అదే మెంటాల్టీ ఆయ‌న‌ను అల‌విమాలిన హామీలు గుప్పించేందుకు పురిగొలుపుతున్న‌ది. తాజాగా రైతుబీమాకు ప్ర‌భుత్వం 2021- 22 సంవ‌త్స‌రానికి చెల్లించాల్సిన ప్రీమియం కింద 800 కోట్ల‌ను విడుద‌ల చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందులోనే పెద్ద తిర‌కాసు ఉంది. అది ఎవ‌రికీ తెలియ‌దు.

వాస్త‌వంగా రాష్ట్ర వ్యాప్తంగా 58ల‌క్ష‌ల మంది రైతులున్నారు. ఇందులో 18 -59 సంవ‌త్స‌రాల లోపుఏ వ‌య‌స్సున్న వారు మాత్ర‌మే రైతుబీమాకు అర్హులు. ఆ కేట‌గిరిలో దాదాపు 36 ల‌క్ష‌లకు పైగా రైతులు బీమాకు అర్హుల‌వుతారు. ఒక్కొక్క‌రికి 3,500ల‌ను ప్రీమియం కింద ప్ర‌భుత్వం చెల్లిస్తుంది. ఈ లెక్క‌న దాదాపు 1100 కోట్ల‌కు పైగా అవ‌స‌రం ప‌డ‌తాయి. కానీ డ‌బ్బులేవ‌ని ప్ర‌భుత్వం 800 కోట్లు విడుద‌ల చేసింది. ఇంకా 300 కోట్ల వ‌ర‌కు పెండింగ్‌లో పెట్టేసింది. పోనీ, ఈ విడుద‌ల చేసిన 800 కోట్లైనా వెంట‌నే ఎల్ఐసీకి మొత్తం చెల్లిస్తుందా? అంటే అదీ లేదు. ఎందుకంటే ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర నిధుల్లేవ్‌. ఓ నాలుగైదు ఇన్‌స్టాల్‌మెంట్ల‌లో వీటిని అప్పుడ‌ప్పుడుగా చెల్లిస్తుంది. దీంతో ఎల్ఐసీ కంపెనీ ప్ర‌భుత్వం ఎలా నిధులు విధిల్చితే అలా వారికి బీమా ఐడీని జ‌న‌రేట్ చేస్తారు. మిగిలిన వారికి మ‌ళ్లీ డ‌బ్బులు వ‌చ్చేంత వ‌ర‌కు పెండింగ్‌లో పెట్టేస్తారు. అంతే ఆలోగా బీమా ఐడీ జ‌న‌రేట్ కానివాళ్లు మ‌ర‌ణిస్తే ఆ వ‌చ్చే ఐదు ల‌క్ష‌లు రావ‌న్న‌మాట‌.

మొత్తం అర్హులైన రైతుల‌కు బీమా ప్రీమియం చెల్లించ‌క‌పోవ‌డంతో గ‌తేడాది దాదాపు 7ల‌క్ష‌ల మంది రైతులు ఈ ప‌థ‌కానికి దూరం కాగా.. ఈ సారి 300 కోట్లు ఎగ‌గొట్ట‌డం ద్వారా 8.50 ల‌క్ష‌ల మంది రైతులు బీమాకు దూర‌మ‌వుతున్నారు. ఆ విడుద‌ల చేసిన మొత్తం కూడా టైంకు క‌ట్ట‌క‌పోవ‌డంతో ఆలోపు ఏదైనా రిస్క్ జ‌రిగితే ఐడీ రానివాళ్ల‌కు ఈ బీమా వ‌ర్తించ‌దు. అంటే మొద‌టి కిస్తీ కింద విడుద‌ల చేసే ఆ మొత్తం డ‌బ్బు ప్ర‌కారం ఎల్ఐసీ మొద‌ట జ‌న‌రేట్ చేసే ఐడీ వ‌చ్చిన రైతు కుటుంబాల‌కు మాత్రమే ఇప్పుడిది బీమా ధీమాను ఇస్తుంది. మిగ‌తా వారికి బీమా ర‌క్ష‌ణ లేదు.

గ‌తేడాదితో పాటు ఈ సారి కూడా చాలా మంది రైతు కుటుంబాల‌కు రైతుబీమా వ‌ర్తించ‌లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చ‌నిపోయిన చాలా కుటుంబాల‌కు ఐదు ల‌క్ష‌ల బీమా రాలేదు. వ్య‌వ‌సాయ‌శాఖ ద‌గ్గ‌ర అవీ పెండింగ్‌లో ప‌డిఉన్నాయి. అవి వ‌స్తాయ‌ని ఇంకా రైతు కుటుంబాల‌కు ఎదురుచూస్తున్నాయి. వారికి తెలియ‌ని విష‌యం ఏమిటంటే అవి ఎప్ప‌టికీ రావు. ప్ర‌భుత్వానికి ఇదంతా తెలుసు. కానీ ఏమి చేయ‌లేదు. బ‌య‌ట‌కు చెప్పుకోనూలేదు.