హైదరాబాద్:
కేసిఆర్ కు దేశ వ్యాప్తంగా ఆదరణను చూసి ఓర్వలేక…మోడీ,అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీ,అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. అమ్ముడు పోయి మునుగోడు ఎన్నిక తెచ్చిన రాజ గోపాల్ రెడ్డి లాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని,వారు ఉద్యమ కారులని,టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలన్నారు.
ఒక్కో ఎమ్మేల్యేకు 100 కోట్లు,కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోబాలతో బీజేపీ కొనుగోలు కుట్రను తిప్పి కొట్టిన మా ఎమ్మెల్యేలకు యావత్ తెలంగాణ ప్రజల పక్షాన సెల్యూట్ అని అన్నారు. బీజేపీ మోడీ,అమిత్ షా కు కేసిఆర్ భయం పట్టుకుందని,వారి ఢిల్లీ పీఠం కదులుతుందనే ఈ కుతంత్రాలకు పాల్పడుతున్నారని మంత్రి వేముల మండిపడ్డారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యేల ను కొంటూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూల దోస్తున్న బీజేపీ కి తగినశాస్తి జరుగుతుందని తీవ్రంగా హెచ్చరించారు.