ఇందూరు గడ్డపై సోమవారం నిర్వహించిన చారిత్రాత్మక బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తన సహచరుడైన దివంగత రైతు నేత వేముల సురేందర్ రెడ్డిని గుర్తు చేసుకోవడం ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశమే. కేసీఆర్-సురేందర్ రెడ్డిల మధ్య స్నేహబంధం ఎంత విడదీయలేనదో నిజామాబాద్ జిల్లాలో మలిదశ తెలంగాణ ఉద్యమ శంఖారావం పూరించిన ఘట్టానికి ఈ ఇద్దరు నేతలకు అంతే సంబంధముంది. తెలంగాణ సాధన కోసం భావజాల ఏకాభిప్రాయమున్న అతికొద్ది మందితో కలిసి నాడు ఉద్యమ ముందడుగు వేశారు కేసీఆర్. ఆ సమయంలో కేసీఆర్‌తో అడుగులు కలిపిన ఆ అతికొద్ది మందిలో వేముల సురేందర్‌రెడ్డి ఒకరు.
ఉద్యమాన్ని తెలంగాణ వ్యాప్తంగా బలోపేతం చేయ బయలుదేరిన కేసీఆర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడీ మైదానంలో తొలి శంఖారావం పూరించింది వేముల సురేందర్‌రెడ్డితో కలిసే. రైతు నేపథ్యమున్న ఇందూరు జిల్లాలో రైతు రాజకీయ నేపథ్యమున్న సురేందర్‌రెడ్డితో కలిసి తొలి ఉద్యమ కార్యాచరణ నడిపించారు కేసీఆర్. నేడు రైతు సంక్షేమం కోసం దేశమంతా రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలను అందించే జాతీయ రాజకీయ సమాలోచనలు చేస్తున్న కేసీఆర్ తన ఆలోచనలను ఈ సభలో వేముల సురేందర్‌రెడ్డిని గుర్తు చేసి మరీ జనాలకు చెప్పారు. తద్వారా సురేందర్‌రెడ్డికి కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం, జిల్లాలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉన్న అనుబంధాన్ని గొప్పగా చాటారు.
సురేందర్‌రెడ్డి సొంత గ్రామం పక్కనే గల మోతె గ్రామాన్ని, మోతె పోషించిన ఉద్యమ దిక్సూచి పాత్రను కేసీఆర్ గుర్తు చేసి సురేందర్‌రెడ్డి నాయకత్వ ముఖ్య సందర్భాలను యాది చేసుకున్నారు కేసీఆర్.