సీఎం టూర్ ఖరారైన నాటి నుంచి అన్నీ తానై వ్యవహరించారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. పార్టీ కార్యాలయ భవనంతో పాటు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు సీఎం రాక ఖరారైనా నాటి నుంచి జిల్లా కేంద్రంలోనే బస చేశారు మంత్రి. రేయింబవళ్లు ఆయన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దగ్గరుండి చూసుకున్నారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో శ్రద్ద తీసుకున్నారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పూజ కార్యక్రమాలను మంత్రితోనే చేయించారు కేసీఆర్.
వేదిక మీద దివంగత రైతు నేత , మంత్రి వేముల తండ్రి వేముల సురేందర్‌రెడ్డి పేరు ను కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఆనాడు ఆయన ఉద్యమంలో తనకు చేదోడువాదోడుగా ఉన్న రోజులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఖలీల్‌వాడీ మైదానంలో జరిగిన బహిరంగ సభను, మోతే ముడుపు .. ఉద్యమానికి ఊపుతెచ్చిన సందర్బాన్ని ఉటంకిస్తూ.. అదే స్పూర్తితో దేశ రాజకీయాల్లోకి అడుగిడుతున్నట్టు చెప్పారు. ఆనాడు రాష్ట్ర సాధన కోసం మోతె ముడపు లాగే… ఈ వేదికగా 2024లో బీజేపీ ముక్త్ భారత్ జెండాను ఎగురవేస్తానని ప్రకటించారు. దేశంలో మన ప్రభుత్వమే ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన… ఉచితంగా 24 గంటల కరెంటును దేశ రైతులందరికీ అందిస్తానని కూడా చెప్పారు.
సభ సక్సెస్‌తో ఇందూరు గులాబీ దళంలో కొత్త జోష్ నింపింది. మొన్నటి వరకు నిస్తేజంగా ఉన్న గులాబీ నేతలు, కార్యకర్తలు సభ సక్సెస్‌తో కొత్త ఊపులో ఉన్నారు. ఓ వైపు పార్టీ కార్యాలయం… మరోవైపు కేసీఆర్ ఇందూరు వేదికగా ఇచ్చిన కీలక తీర్పు.. భారీ జనసమీకరణ… నిధుల కేటాయింపు… ఇవన్నీ జిల్లా పార్టీ నేతలకు వెయ్యేనుగల బలాన్నిచ్చాయి. సభ ముగియగానే మంత్రి వేముల .. కేసీఆర్‌తోనే కలసి హైదరాబాద్ పయనమయ్యారు.