అనుకున్నట్టుగానే కేసీఆర్ నిజామాబాద్ గడ్డ మీద నుంచి కీలక ప్రకటన చేశారు. మరో ఉద్యమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఖలీల్‌వాడీ మైదానంలో చేసిన వాగ్దానం.. మోతే గ్రామానికి వెళ్లి ముడుపు కట్టి ఏకగీవ్ర తీర్మానం చేసిన ఉద్యమ గురుతులను … ఇక్కడి వేదికగా నెమరువేసుకున్నారు. అదే స్పూర్తితో ఇక్కడి నుంచే ఆయన దేశ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఇక్కడి రైతుల మద్దతు, స్పూర్తితో దేశ రాజకీయాల్లోకి అడుగిడుతున్నానని, బీజేపీ ముక్త్ భారత్ జెండాను ఎగురవేయబోతున్నామని ప్రకటించారు. బీజేపీయేతర ప్రభుత్వం దేశంలో ఏర్పడనుందని, తెలంగాణ రైతులకు ఇచ్చినట్టుగానే దేశంలోని రైతాంగానికంతా ఉచిత కరెంటు 24 గంటలు అందిస్తానని కూడా ఆయన ఈ బహిరంగ సభ వేదికగా ప్రకటించి .. యావత్తు దేశ రాజకీయాల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.
ఎన్పీఏల పేరుతో కార్పొరేట్ గద్దలకు లక్షల కోట్లు మాఫీ చేయించి… రైతులకు మాత్రం ఇచ్చేందుకు మోడీకి మనసు రావడం లేదన్నారు. ఇన్నేండ్ల బీజేపీ అధికార కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టైనా, ఏ ఒక్క పరిశ్రమనైనా ఏర్పాటు చేశాడా అని నిలదీశారు కేసీఆర్. ఇందూరు గడ్డ లక్ష్మీ గడ్డ అని …ఇక్కడ నుంచే దేశ వ్యాప్త రైతు ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు. గోదావరి నీళ్లు పారాల్నా… మత పిచ్చితో రక్తం ఏరులై పారాల్నా.. అని బీజేపీ వస్తే ఎంత విధ్వంసమవుతుందో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పార్టీ మనకొద్దని, లౌకిక ప్రజాస్వామ్య శక్తుల రాజ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ వేదికగానే జాతీయ రాజకీయాలకు అడుగుపెట్టే ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దేశం కోసం, దేశ ప్రజల బాగు కోసం, రైతుల సంక్షేమం కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్దమని కూడా ప్రకటించారు.
అర్బన్‌కు 100 కోట్లు… ఎమ్మెల్యేలకు అదనంగా మరో పది కోట్లు…
సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటనలో వరాలు కురిపించారు. నిజామాబాద్ నగరం బాగా అభివృద్ది చెందిందని, ఇంకా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని, దీని కోసం 100 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 8 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకు ఉన్న 5 కోట్ల నిధులకు అదనంగా మరో పది కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు కేసీఆర్.
పాత కలెక్టరేట్ భవనం జాగాలో ఇందూరు కళా భారతి ఆడిటోరియం…
కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభించిన నేపథ్యంలో పాత కలెక్టరేట్ జాగాలో ఇందూరు కళాభారతి ఆడిటోరియాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు.
దివంగత నేత వేముల సురేందర్ రెడ్డి ని జ్ఞాపకం చేసుకున్న కేసీఆర్..
దివంగత రైతు నేత వేముల సురేందర్ రెడ్డి ని కేసీఆర్ ఈ వేదికగా జ్ఞాపకం చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఖలీల్‌వాడీ మైదానంలో ఆనాడు జరిగిన భారీ బహిరంగ సభను జ్ఞాపకం చేసుకున్నారాయన. ఆనాడు అక్కడ చేసిన వాగ్దానమే మోతే ముడుపు కట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అదే ఉద్యమ స్పూర్తితో దేశ రాజకీయాలను మార్చేందుకు, రైతులు, ప్రజల జీవితాలను మార్చేక్రమంలో ఎంతకైనా తెగించేందుకు సిద్దమైనట్టు ప్రకటించారు.
మోడీ ఇప్పటి దాకా చేసిన ఉద్దార్కం ఏందీ…?
తొలిసారి కేసీఆర్ నిజామాబాద్ వేదికగా మోడీపై ఘాటు విమర్శలు చేశారు. రూపాయి విలువ పతనమైందని, నిరుద్యోగం పెరిగిపోయిందని ధ్వజమెత్తిన కేసీఆర్.. ఆయన ఏ రంగంలో ఉద్దార్కం చేసిండు.. గిరిజనులు, రైతులు, దళితులు, మహిళలు… అన్ని రంగాలను విస్మరించిండు.. ఇది చాలదంటూ మదమెక్కి ప్రభుత్వాలను కూల్చుతున్నాడు. బలుపుతో ఇవన్నీ చేస్తున్నాడంటూ విరుచుకుపడ్డారాయన…ఏ దేశంలోని లేని గొప్ప వరం భారత దేశానికి ఉందన్నారు కేసీఆర్. 41 కోట్ల ఎకరాల వ్యవసాయ ఆమోదయోగ్యమైన భూమి ఉందని, ఎన్నో నదులున్నా… ఏమీ చేయాలని నిస్సహాయ స్థితిలో మోడీ ఉన్నాడన్నారు.
టీఆరెస్ పార్టీ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవాలకు దూరంగా కవిత..
ఎమ్మెల్సీ కవిత నేరుగా హైదరాబాద్ నుంచి సభావేదిక వద్దకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ముందుగా పార్టీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరుకాలేదు. ఆ తర్వాత కొత్త కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించే కార్యక్రమానికీ ఆమె హాజరుకాలేదు. అక్కడే సభావేదికపైనే ఆసీనులై కూర్చున్నారు. ఆ వేదిక మీద కూడా ఆమె ప్రసంగించుకుండా ముబావంగానే ఉండిపోయారు.