బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ తండ్రి మూడు నెలల క్రితం కరోనాతో చనిపోయాడు. బోధన్‌లోని తన నివాసంలోనే ఆయన తండ్రి ఉంటుండే వాడు. టీచర్‌గా, ఎంఈవోగా, అనియత విద్య డివిజన్ స్థాయి అధికారిగా సేవలందించిన షకీల్ తండ్రిని కరోనా బలి తీసుకున్నది. తండ్రంటే విపరీతమైన అభిమానం, ప్రేమ షకీల్‌కు. ఆయన అకాల మరణం ఎమ్మెల్యేను కుంగదీసింది. ఏప్రిల్ 14న ఆయన చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత షకీల్ బోధన్‌కు రావడానికే ఇష్టపడడం లేదు. హైదరాబాద్‌కే ఎక్కువ పరిమితమవుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఆడపాదడపా వచ్చినా ముఖ్యమైన వారితో ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోతున్నాడు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పై సంతకాలు చేస్తున్నాడు. కరోనాతో చనిపోయిన పలువురి కుటుంబాలను ఈ మధ్య కాలంలో పరామర్శించాడు. ఆ పై ఆయన రావడం మరింత తగ్గుతూ వస్తున్నది.
తన సన్నిహితుల ముందు… నాన్న లేని ఆ ఇంట్లోకి రావాలంటేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. తను బోధన్‌కు వచ్చిన ప్రతి సందర్భంలో తనను కలిసేందుకు వచ్చిన చాలా మంది తండ్రితో కలిసి మాట్లాడి వెళ్లేవారు. తండ్రి లేని ఆ ఇల్లు బోసిపోయి ఉందనే భావనలో, ఆవేదనలో షకీల్ ఉన్నాడు.
దీనికి తోడు తండ్రి చనిపోయినా కేసీఆర్ పరామర్శించలేదనే బాధ కూడా అతన్ని వెంటాడుతున్నది. కేటీఆర్ కూడా తన ఇంటికి రాలేదని పలువురితో చెప్పకొని బాధపడినట్లు తెలిసింది. ఈ కారణాలతో నియోజకవర్గానికి దూర దూరంగా ఉంటూ వస్తున్నాడు. నాయకులకు ఏం చేయాలో అర్థం కాక ఓ సారి అజ్ఞాతంలో ఉన్న తమ నేతను కలిసి బతిలాడి తిరిగి యాక్టివ్ అయ్యేలా చేయాలని నిర్ణయించుకున్నారు. అంతా కలిసి హైదరాబాద్ వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు.
