రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడంతో కలకలం రేగింది. కవిత ఇంటి ముందు బీజేపీ శ్రేణుల ధర్నా.. టీఆరెస్ నాయకుల దాడులు.. ఇవన్నీ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. దీనిపై బండి సంజయ్ ధర్నా ..అరెస్టు.. మరోవైపు రాజాసింగ్ అరెస్టులతో అంతా ఒక్కరోజే ఆగమాగం చేశారు. దీనికి తోడు ప్రవక్తపై అభ్యంతకరంగా వీడియో పెట్టాడనే కారణంగా పార్టీ హై కమాండ్ రాజాసింగ్‌ను సస్పెండ్ చేయడం సంచలనం రేకెత్తించింది. పార్టీ సిద్దాంతాలకు విరుద్దంగా నడుచుకున్నాడనే కారణంతో దీనిపై చర్యలు తీసుకున్న హైకమాండ్ పది రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ ఇచ్చింది. నుపూర్ శర్మ విషయంలోనూ ఇదే జరిగింది.
ఇలాంటిది మరోమారు జరగకుండా జాగ్రత్త పడ్డ బీజేపీ హై కమాండ్‌కు రాజాసింగ్ నుంచి అలాంటి వివాదస్పద ప్రవర్తనే ఎదురుకావడంతో వెంటనే పరిస్థితిని చక్కదిద్దుకునే పనిలో పడింది. ప్రవక్త పై ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో రాజాసింగ్ పై తప్పనిసరి చర్యలకు దిగింది హైకమాండ్. కానీ ఇదంతా ఓ పదిరోజుల డ్రామాగానే కొట్టిపారేస్తున్నారు జనం. బీజేపీ సిద్దాంతమే అదైనప్పుడు .. దీన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన పనిలేదనే భావనలో బీజేపీ శ్రేణులున్నాయి. రాజాసింగ్ వివరణతో సరిపెట్టుకుని మళ్లీ పరిస్థితి యథాతధంగా మార్చేందుకు బీజేపీ సిద్దంగా ఉంటుంది. ఈ నాలుగు రోజుల డ్రామా మాత్రం రక్తికట్టిస్తుంది.