ఒక్క‌సారిగా ఉవ్వెత్తున లేచిన కెర‌టంలా నిజామాబాద్ న‌గ‌రంలో బీజేపీ పుంజుకున్న‌ది. ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. క‌నీసం అంచ‌నా కూడా వేయ‌లేదు. ఏకంగా సీఎం కూతురు, క‌విత‌ను అర్వింద్ ఓడ‌గొట్టి తాను నిజామాబాద్ ఎంపీగా గెలుస్తాడ‌ని. ఆ త‌ర్వాత మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా స‌త్తా చాటింది బీజేపీ. అంతా తానై వ్య‌వ‌హ‌రించాడు అర్వింద్‌. టికెట్ల పంప‌కాల‌లో త‌న‌దే పెత్త‌నం. ఎవ‌రి మాట విన‌లేదు. అందులోని గ్రూపుల‌కు చెక్ పెట్టాడు. త‌ను అనుకున్నవారికి, అనుచ‌రుల‌కు టికెట్లిచ్చాడు. క‌విత ఓడిపోవ‌డం, అర్బ‌న్ ఎమ్మెల్యే బిగాల గ‌ణేశ్ గుప్తా అంతా తానై వ్య‌వ‌హ‌రించ‌డం… ఎవ‌రికీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అవ‌కాశం క‌ల్పించ‌క‌పోవ‌డంతో బీజేపీకి మ‌రింత క‌లిసి వ‌చ్చింది. అనూహ్యంగా 29 మంది కార్పొరేట‌ర్ల‌ను బీజేపీ గెలుచుకుంది.

ఇది టీఆరెస్‌కు దెబ్బ‌. ఎంఐఎం స‌పోర్టు లేక‌పోతే మేయ‌ర్ సీటు బీజేపదే. చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన చందంగా టీఆరెస్ మిత్ర‌ప‌క్షాలు, స్వ‌ప‌క్షంలో బ‌లంతో మేయ‌ర్ సీటు కైవ‌సం చేసుకున్న‌ది. ఇక అప్ప‌ట్నుంచి అర్వింద్ వైఖ‌రిలో మ‌రింత మార్పు వ‌చ్చింది. అంతా త‌న‌వ‌ల్లే అనుకున్నాడు. త‌ను లేక‌పోతే నిజామాబాద్‌లో బీజేపీయే లేదు అనేంత వ‌ర‌కూ వ‌చ్చింది వ్య‌వ‌హారం. అంతా ఏక‌ప‌క్షం. ఒంటెత్తు పోక‌డ‌. ఎవ‌రి మాట లెక్క‌చేయ‌క‌పోవ‌డం. ఒక్కో సారి ఆత్మ‌గౌర‌వం కోసం వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి… సీనియ‌ర్ల‌కు కూడా. ఇదే బీజేపీ కొంప ముంచుతున్న‌ది. క్ర‌మంగా టీఆరెస్ వైపు చూడ‌సాగారు బీజేపీ కార్పొరేట‌ర్లు. ఒక్క‌రు.. ఇద్ద‌రు…..ముగ్గురు.. వ‌రుస క‌ట్టారు. పార్టీని అంటి పెట్టుకున్న సీనియ‌ర్ నాయ‌కులు కూడా అర్వింద్ తాకిడికి బీజేపీకి వీడి పోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

ఈ రోజు టీఆరెస్‌లో చేరిన మ‌ల్లేష్ యాద‌వ్ ప‌రిస్తితి కూడా అంతే. స్వంత గూటిలో మ‌ర్యాద లేన‌ప్పుడు… ఉనికే ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతున్న‌ప్పుడు… అవ‌త‌లి ప‌క్షం గాల‌మేసి…. అభివృద్ధి వ‌ల వేసిన‌ప్పుడు…. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవ‌చ్చ‌నే సామెత‌ను ఫాలో అవుతున్న‌ప్పుడు… ఇదిగో ఇలా వ‌ల‌స‌లు పెరుగుతాయి. ఇప్పుడు ఇందూరు రాజ‌కీయంలో ఇదే జ‌రుగుతుంది. ఇదే వైఖ‌రితో బీజేపీ ముందుకు పోతే.. వ‌న్ మ్యాన్ ఆర్మీలా అర్వింద్ ఒక్క‌డే మిగులుతాడు..చివ‌రాఖ‌ర‌కు.

You missed