ఉద్యమ పార్టీగా అధికారం చేపట్టిన టీఆరెస్కు మళ్లీ ఉద్యమకార్యాచరణ రూపొందించింది. వరి రైతు కోసం. రోడ్డెక్కింది. ఆందోళనలు చేపట్టింది. దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వంటావార్పు చేసినట్టుగానే ఢిల్లీకి సెగతగిలేలా అన్ని రకాల ఉద్యమ కార్యాచరణను చేపట్టనుంది. నేటి నుంచి టీఆరెస్ వరి రైతు పోరు ఉద్యమం ఉధృతం చేయనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ విడుదల చేసింది టీఆరెస్ అధిష్టానం. కొన్ని రోజుల్లో వరి కోతల దశకు చేరుకోనుంది. ప్రత్యక్షంగా ఆ సమస్యను ఎదుర్కొనేది టీఆరెస్సే.
వరి వద్దని ఎంత మొత్తుకున్నా రైతులు వినలేదు. దాదాపు 80 శాతం వరి సాగయ్యింది. ఈ సీజన్లో వచ్చేవి బాయిల్డ్ రైస్. బాయిల్ చేయకపోతే అవి నూకగా మారుతాయి. బాయిల్ చేస్తే ఒక బాధ.. చేయకపోతే…. వచ్చే ఉప్పుడు బియ్యం కేంద్రం కొననంటుంది. మరి ఎవరు కొనాలి…? ఇప్పుడిదే అసలు సమస్యగా మారింది. కేంద్రం కొనకపోతే కేంద్రం ధాన్యం కొనుగోలు చేసి ఏం చేసుకుంటుంది..? ఇది పెద్ద సమస్యే. రైతులు రోడ్డెక్కకముందే టీఆరెస్ రోడ్డెక్కింది. ఉద్యమ బాట పట్టింది. కేంద్రం మెడలు వంచి బియ్యం కొనిపిస్తామంటుంది. అక్కడ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాత్రం ఏ మాత్రం మెత్తబడకపోగా… నూకలు మీరు తినండి.. మీ ప్రజలకు తినడం అలవాటు చేయించండి.. ప్రైవేటు వాళ్లకు అమ్ముకోండి….అంటూ రోజుకో మాట మాట్లాడుతున్నాడు. ఇద్దరి మధ్య మాటల యుద్దం నడుస్తుంది. మరింత గ్యాప్ పెరిగింది. దీంతో ఈ యాసంగి సీజన్ బియ్యం కేంద్రం కొనడం అనేది అంతా ఈజీగా అయ్యే పనిలా కనిపించడం లేదు.
ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు సరైన రీతిలో స్పందించడం లేదు. కేసీఆర్ను ఇరుకున పెట్టే విధంగా వ్యవహారం మారితే చాలు.. అని చూస్తున్నాయే తప్ప రైతుల పక్షాన అవి ఆలోచించడం లేదు. కత్తీ మాది కాదు.. నెత్తీ మాది కాదనే రీతిలో వ్యవహరిస్తున్నాయి. చలి మంటలు కాచుకుంటున్నాయి. రైతులు రోడ్డెక్కితే టీఆరెస్ పై ఒత్తిడి పెరుగుతుంది.. చచ్చినట్టు కేసీఆర్ ధాన్యం కొంటాడు.. అని రెచ్చగొట్టే దోరణిలోనే ఆ పార్టీ నేతలున్నారు. దీంతో టీఆరెస్ ఉద్యమ సెగను ఢిల్లీకి తాకేలా ప్లాన్ చేస్తన్నది. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించేందుకు ఈ వేదికను ఉపయోగించుకుంటున్నది. నూకలు తినండని కేంద్ర మంత్రి అన్న మాటలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. తెలంగాణలో ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్కు ప్రజల వద్ద ఎలాంటి మంచి మార్కులు రాకుండా.. రైతు పక్షాన పోరాడేది.. రైతు సంక్షేమ ప్రభుత్వం తమదేనని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమ గర్జన చేసేందుకు గులాబీదళం సిద్దమైంది. నాటి ఉద్యమ స్పూర్తిని ఈ సందర్భంగా మరోమారు ప్రదర్శించేందుకు సన్నద్దమయ్యింది.
