(ఆర్ఆర్ఆర్ సీన్మ టికెట్ల ధరలు పెంచుడు మీద నా నిరసన.
గోరటెంకన్న సమరసింహారెడ్డి మీరు సల్లంగుండాలె పాటకు పేరడీ.
ఇట్లుంటది మనతోని..!)
…
రాజామౌలీ దొరాగారు సల్లంగుండాలె.. మీరు హాయిగుండాలె.
త్రిబులారూ సీన్మ పేర మీరు టీజరొదలాలె.. మావొల్లు ఎదురుసూడాలె.
అయ్యా.. తాలింపేసి టైంపాసుకు ట్రైలరిడువాలె.. మేమంత సప్పట్లేయాలె.
మీ సీన్మ మీద పైసలం.
మీ ప్లాను కింద పాసులం.
మీ సేతులోని టికిట్లం.
మీరు ఫసకో ఫసకో ఫసకో అంటే ఫాలో అయ్యే తిక్కలం.
మీరు రేట్లూవెంచితే..
మీరు రేట్లువెంచితే.. రెక్కాలొచ్చి థియేటర్లకురికే ఫ్యాన్సు కొడుకలం!
మీరు సల్లంగుండాలె బాబూ హాయిగుండాలె.. మీరు సల్లంగుండాలె బాబూ హాయిగుండాలె.
మీ బాహుబలీ సీన్మ కోసం లైన్లు కట్టాలె.. లడాయి చెయ్యాలె.
మీ కొత్త సీన్మా కోసమనీ కావలుండాలె.. కటౌటూగట్టాలె.
కోట్లారూపాల కర్సూ అనీ జోలెపట్టాలె.. మా పర్సూలేపాలె.
భారీ వసూలు మీగ్గావలె.. బగ్గగావాలె.
మా సదువుకునే పోరగాడు మీ చేతిల బుగ్గ గావాలె.
మీరెన్ని సీన్మలనౌన్స్చేస్తే వాడంతౌలా గావాలె.
మీరు సల్లంగుండాలె బాబూ హాయిగుండాలె.. మీరు సల్లంగుండాలె బాబూ హాయిగుండాలె.
ఐదొందాలయ్యిందనీ టికెటిస్తే లటుక్కనందుకోవాలె.
దాసిపెట్టిన పైసలన్నీ మీ చేతిలెయ్యాలె.
దంచికొట్టిన వీరోనుజూసి దండాలెయ్యాలె.
మా పిలగాని ఫీజు పైసల్ కట్టకపోయినా.. మీ కౌంటర్లల్ల షో పైసలు సదివియ్యాలె.
కొలువుల నోటిఫికేషన్లువడినా మర్శిపోవాలె.. మీ సీన్మ రిలీజ్ డేట్లయితే దినాం యాదికి రావాలె.
ఎన్టీయారు డైలాగ్గొడితే మా నోళ్లు దద్దరిల్లాలె.. ఆ చరణు బాబు ఫైటుజూసి మేం సంకలుగుద్దాలె.
నారేనారే నారే నా..
అయ్యలో.. ఓ బాబులో.. పెద్ద దొరలో.. త్రిబులార్లు మీరే మా సారులో..
వీరోలుగా మీ సీన్మ విట్టుగొట్టాలె.. ఈసీన్మాజూసి మావోల్లంతా సీటిగొట్టాలె..
ప్యానిండియాలో ఫేమసయి మీరు ఎదిగిపోవాలె.. మా పాడువడ్డ పాక కింద మేం పండూకోవాలె!
ఆ భగత్ సింగులాంటి నేతై మీరు సాగాలె.. మీ పార్టీ కండువాలొచ్చి మా మెడల పడాలె!
బాబూ సల్లంగుండాలె.. హాయిగుండాలె.. మీరు సల్లంగుండాలె.. హాయిగుండాలె.!
…
దాయి శ్రీశైలం
త్రిబులార్ సీన్మ టికెట్ల అడ్డగోలు పెంపకం వ్యతిరేక సంఘం అంతర్జాతీయ అధ్యక్షుడు
