సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల సందర్బంగా నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన సభ… అర్వింద్ టార్గెటెడ్‌గా కొనసాగింది. ఇకపై దంచుడే అంటూ ఈ వేదిక సాక్షిగా అర్వింద్‌కు అల్టిమేటం జారీ చేసింది ఇందూరు గులాబీ దళం. మొన్న ఆర్మూర్‌లో, అంతకు ముందు రూరల్, దానికి ముందు బాల్కొండ నియోజకవర్గాల్లో అర్వింద్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇది రాజకీయంగా మరింత వేడిని పుట్టించింది.
అర్వింద్ ఎంపీగా గెలిచిన తర్వాత ఇక్కడి రాజకీయాల్లో మాటల దాడి పెరుగుతూ వచ్చింది. సీఎంనూ వదలకుండా నోటికి ఏదొస్తే అది వాగుడే రాజకీయంగా పెట్టకున్నాడు అర్వింద్. ఇది కొంత కాలం చెల్లుబాటయ్యింది. అంతా బాగుందనుకున్నారు. రాన్రాను ఆ మాటలు వెగుటు పుట్టించాయి అందరిలో. దీనికి తోడు టీఆరెస్ కూడా ప్రతిదాడికి దిగింది. మాటలతోనే కాదు.. భౌతికంగా కూడా. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు తెర తీశాయి.
అప్పటి వరకు నోటికి అదుపులేకుండా పోయిన అర్వింద్‌కు తాళం పడింది. ఇక్కడ అధికారులనూ వదలకుండా తిట్టడం అర్వింద్‌కు అలవాటు. మొన్న కొత్తగా వచ్చిన సీపీ ని కానిస్టేబుల్ కన్నా అధ్వానం అని తిట్టాడు. దీంతో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెట్టాలని ఆందోళన చేశాయి. దీంతో నాలుక్కర్చుకున్నాడు అర్వింద్. ఇక అధికారుల జోలికి పోతే .. ఏది పడితే అది మాట్లాడితే అది బూమరాంగ్ అవుతుందని కొంత లేటుగా తెలుసుకున్నాడు. కానీ ఆలోపు టీఆరెస్ మరింత దూకుడు పెంచుతూ పోతున్నది. అర్వింద్ ఇచ్చిన హామీ… పసుపు బోర్డుపై ఎక్కడికక్కడ నిలదీతలు తీవ్రతరం చేస్తున్నారు.
మాటకు మాట… మితిమీరితే వాత అన్న విధానాన్ని అవలంభిస్తున్నది ఇందూరు టీఆరెస్. గురువారం జరిగిన కేసీఆర్ బర్త్ డే వేడుక .. అర్వింద్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చేందుకు ఉపయోగపడింది. ఇక నుంచి ఆట మొదలైందంటూ …. కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు నేతలు. ఇక ఇక్కడి ఇందూరు రాజకీయాలు మరింత రసవత్తరం కానున్నాయి. మాటల దాడులు మరింత పెరగనున్నాయి. ఒకరి ఎత్తులకు మరొకరి పై ఎత్తులు, ఒకరి మాటకు మరొకరి తూట… ఇప్పుడు ఇదే ఇందూరు రాజకీయ ముఖచిత్రం కానుంది.