తెలంగాణ ఉద్యోగుల కొత్త జిల్లాల వారీగా విభజన ప్రక్రియలో ఇచ్చిన జీవో వివాదస్పదమైంది. ప్రభుత్వం దీన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు అనుగుణంగానే ఇచ్చింది. సినియారిటీకి పెద్ద పీట వేసింది. స్థానికతను విస్మరించింది. ఇక్కడే వచ్చింది చిక్కంతా. మొన్నటి వరకు లోకల్‌గా ఉన్న వాళ్లంతా ఇప్పుడు సినియారిటీ లేకపోవడంతో కొత్తగా ఏర్పడిన కొత్త జిల్లాకు వెళ్లి అక్కడే ఉద్యోగాలు చేస్తూ నాన్ లోకల్‌గా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు ఇది కొత్త వివాదాన్ని తెచ్చి పెట్టింది. ఒక్క ఉపాధ్యాయులే కాదు.. అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. అయితే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వీళ్లే రోడ్డెక్కుతున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఎందుకంటే ఇది మార్చాలంటే ఓ పెద్ద ప్రక్రియనే. కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరం. కానీ కేసీఆర్ అంత చొరవ, రిస్కు తీసుకుంటాడా? ఇప్పుడు ఉన్న పళంగా ఉద్యోగుల విభజన ఆగమేఘాల మీద చేయాలనుకున్న కేసీఆర్.. కొత్తగా ఈ జీవోను మార్చే ప్రక్రియన భుజానేసుకోవడం కుదరదు. అలా చేయడు కూడా.

మరి ఉద్యోగులు చేస్తున్న నిరసన అరణ్య రోదనేనా..? దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. హై కోర్టులో కేసు తీసుకున్నారు. ఈ రోజు విచారణ ఉంది. కానీ ఈ కేసు నిలవదు. అది ప్రభుత్వానికి కూడా తెలుసు. అంత పకడ్బందీగా ఆ జీవో ఉంది. అందుకే పీఆర్టీయూ లాంటి ప్రభుత్వ సపోర్టు సంఘాలు కనీసం దీనిపై నోరు విప్పటానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే ఇదంతా వృథా ప్రయాస. అనవసరంగా కేసీఆర్ నజర్లో పడి ఆగ్రహానికి గురికావడం ఎందుకని వారి భయం.
ఆంధ్ర పాలకులు ఇష్టారీతిన చేపట్టిన నియామకాలు .. నాన్ లోకల్ వాళ్లను లోకల్‌గా చేసేశాయి. ఇప్పుడు వారికే సినియారిటీ ఉంది. 20 శాతం ఓపెన్ కేటగిరీ లో తీసుకోవాల్సిన ఉద్యోగాల్లో వీటిని రిజర్వ్ కింద నాన్‌లోకల్‌కు పెట్టి ఉద్యోగాలు నింపారు రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న టైంలో. అలా చాలా మంది రంగారెడ్డి జిల్లాలో తిష్ట వేసి .. ఇప్పుడు వారంతా లోకలయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు చెందిన చాలా మంది తమకు కావాల్సిన చోటకు లీడర్లతో చెప్పించుకుని బదిలీపై వచ్చి పట్నంలో పడ్డారు.

అయితే రంగారెడ్డి, లేదంటే పట్టణాలు.. ఇలా సిటీలో బతకడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు వీరంతా సినియారిటీ సంపాదించారు. ఈ ఉద్యోగుల విభజన ప్రక్రియలో సినియారిటీకే ప్రయార్టీ ఇవ్వడంతో లోకల్ ఉద్యోగులు మాత్రం దూర ప్రాంతాలకు, గ్రామీణ ఏరియాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడే వచ్చింది సమస్యంతా. మేము లోకల్ అయి వుండీ .. సర్వీసంతా నాన్‌లోకల్ గా బతకాలా? ఇదేం అన్యాయం. తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంది ఇందుకేనా? స్థానికుల ఉనికే లేకుండా చేస్తున్న ఈ జీవోను మార్చి లోకల్ క్రైటేరియాలో ఉద్యోగుల విభజన చేపట్టలేరా..? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు..? అని ఎన్నో నిలదీతలు, ప్రశ్నలు.. ! కానీ సమాధానాలు లేవు. రావు.
ఉద్యోగుల విభజన మాత్రం యథావిధిగా జరిగిపోతుంది. కోర్టు మెట్లెక్కినా సరే. అంతే
లోకల్ ఉద్యోగులు నాన్‌లోకల్‌కు వెళ్లాల్సిందే. వారంతా నాన్‌లోకల్‌గానే బతకాల్సిందే. అదంతే.
