అలీ … సినిమాలో కడుపుబ్బా నవ్వించే క్యారెక్టర్. అప్పుడెప్పుడో సీతాకొక చిలుక సినిమాతో బాల్యనటుడిగా బాలచందర్ పరిచయం చేశాడు. ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. ఇప్పటికే ఏ యువహీరో పరిచయమైనా.. ఆ హీరోకు స్నేహితుడిగా కరెక్టుగా నప్పే క్యారెక్టర్. ఆ ఏజ్ ఏంటీ..? కింద గేజ్ ఏంటీ..? అనే పూరి జగన్నాథ్ పలికించిన అలీ డైలాగ్ చాలా పాపులర్. కానీ ఆ డైలాగ్ అలీకి సూట్ కాదు. ఎందుకంటే.. ఆ ఏజ్ పెద్దదే కానీ అలా కనిపించడు. ఇంకా చిన్నపిల్లాడి లాగే ఉంటాడు.
అలీతో సరదాగా అంటూ ఎంతో మంది సెలబ్రిటీలను బుల్లితెరకు పరిచయం చేసి తనకంటూ ఓ ప్రత్యేకత నిలుపుకున్నాడు. కొంచెం నోటిదూలతో అప్పడప్పుడు వివాదాల్లోకి అలా వెళ్లి ఇలా వస్తాడు. కానీ తన మానాన తను కామ్ గా పనిచేసుకునే వ్యక్తిత్వం. ఇప్పుడిదంతా ఎందుకంటారా? అలీ భార్య. జుబేదా అలీ. కొత్తగా యూ ట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టింది. అందరిలా ఇంట్లో పని లేక అలా పెట్టి సెలిబ్రిటీ కావాలన్నది ఆమె కోరిక కాదు. ఏదో వంటలు చేసి టైం పాస్ చేయాలన్న ఉద్దేశ్యమూ కాదు. వ్యూస్లూ, లైకులతో అలా ఏదో సంపాదించేద్దామన్న యావా కాదు.. మరెందుకూ..?
తనకు తెలిసిన విద్యను నలుగురికి పంచాలని. అది వంటైనా.. ఇంకేదైనా. సరే , వంట చేసి ఏదో వంటల ప్రోగ్రాముల్లోగా తనే తిని అబ్బ ఎంత బాగుందో అని నోరూరించి మాయమైపోయే ప్రోగ్రాం కాదు. ఆ వంట చాలా మందికి సరిపడా చేస్తుంది. ఆ చేసిన రుచికరమైన వంట ఆమెకు కాదు.. అన్నార్తులకు. రోడ్డు వెంబడి తిరిగే బిచ్చగాళ్లకు. ఎవరూ లేని అనాథలకు. ఆకలితో అలమటించే అభాగ్యులకు. ఇందులో అలీ కూడా తన వంతు దోహదం చేస్తున్నాడు భార్యకు. మనకెందుకులే ఇదంతా వద్దు అని ఆమెని డిసాప్పాయింట్ చేయకపోవడమే అలీ ఆమెకు చేసిన పెద్ద హెల్ప్.
అలా ఆమె భర్త సహాయంతో ఇలా నలుగురికి పరిచయమవ్వడమే కాదు.. తనకు తెలిసిన విద్యను నలుగురితో షేర్ చేసుకుని.. మరో నలభై మందికి ఆకలి తీర్చేలా ప్లాన్ చేసుకోవడమే కొత్తదనం. పెద్దతనం. అది అందరిలో ఉండదు. సెలబ్రిటీలందరికీ ఆ ఆలోచన రాదు. కోట్లున్న వారికీ ఆ తీరిక ఉండదు. చేయాలన్న తలంపు తట్టదు.
హ్యాట్సాఫ్ టు అలీ అండ్ జుబేదా అలీ..
