మంత్రుల క‌న్నా.. వాళ్ల పీఆర్వోలు మ‌రింత బీజీగా ఉంటున్నారా? లేక‌పోతే మ‌రీ అత్యుత్సాహం ప్ర‌దర్శించి ఓవ‌ర్ స్మార్ట్‌గా వెళ్తున్నారా తెలియ‌దు కానీ.. వీరి చ‌ర్య‌లు వ‌ల్ల మంత్రుల‌కు త‌ల‌వంపులు త‌ప్ప‌డం లేదు. అస‌లే మంత్రుల‌కు రోజులు మంచిగా లేవు. ఏదో సంద‌ర్భంలో ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు. ఇది చాల‌దంటూ త‌మ పీఆర్వోలు కూడా కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నారు. ప్ర‌స్తుతం వీళ్ల వ్య‌వ‌హారం మీడియా సర్కిళ్ల‌లో చ‌ర్చ‌కు వ‌స్తున్న‌ది.

మొన్న‌టికి మొన్న మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ పీఆర్వో ..మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ చ‌నిపోయాడంటూ మంత్రి పేరు మీద ఓ సంతాప ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసి హ‌మ్మయ్యా అని చేతులు దులుపుకున్నారు. ఆ త‌ర్వాత నాలుక్క‌ర్చుకున్నాడు. అప్ప‌టికే అది వైర‌ల్ అయ్యింది. మంత్రి దాకా పోయింది. మంత్రి దీనిమీద సీరియ‌స్ అయ్యాడు. పీఆర్వోను క‌సురుకున్నాడు. తాజాగా జంగు ప్ర‌హ్లాద్ విష‌యంలో ఇదే జ‌రిగింది. మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు పీఆర్వో ఈ అత్యుత్సాహ‌పు, నిర్ల‌క్ష్య‌పు, అతి.. కేట‌గిరీలోకి వ‌చ్చాడు. ఆయ‌న చ‌నిపోక‌ముందే చ‌నిపోయాడంటూ ఓ సంతాప ప్ర‌క‌ట‌న విడుదల చేశాడు.

ఈ రోజు ఉద‌యం మంత్రి ఎర్ర‌బెల్లికి సంబంధించిన గ్రూపులో ఉద‌యం 9.45 గంట‌ల‌కు … జ‌న‌నాట్య మండ‌లి గాయ‌కుడు జంగు ప్ర‌హ్లాద్ మృతి ప‌ట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.. అని ఓ సంతాప ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు. మ‌ళ్లీ మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు … తీవ్రంగా గాయ‌ప‌డి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జంగు ప్ర‌హ్లాద్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను. వారికి స్వ‌స్థ‌త చేకూర్చ‌డానికి నిమ్స్ వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వైద్య సేవ‌లు ఫ‌లించాల‌ని మ‌న‌సారా కోర‌కుంటున్నాను- ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. అని టైప్ చేసి త‌న త‌ప్పును స‌రిదిద్దుకున్నాన‌ని స‌రిపెట్టేసుకున్నాడు. ఆ త‌ర్వాత ప్ర‌హ్లాద్ ప‌రిస్థితి ఏమైందో తెలియ‌దు స‌ద‌రు పీఆర్వోకు. రెండు మెస్సేజ్‌లు పెట్టేశాడు. బ‌తికుంటే.. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, ఒక‌వేళ చ‌నిపోతే.. సంతాపం ..ఏదీ అవ‌స‌ర‌మైతే అది మీడియా వాడేసుకుంటుంది. త‌నప‌ని తాను చేసేశాడు అంతే… అనుకున్న‌ట్టున్నాడు.

గుడ్డిగా మంత్రులు పీఆర్వోల‌ను న‌మ్మి వారికి అన్ని ర‌కాల స్వేచ్చనిస్తే ఇగో ఇట్ల‌నే ఉంట‌ది. త‌మ పాండిత్యాన్ని, త‌మ మేథావిత‌నాన్ని రంగ‌రించి దానికి అత్యుత్సాహం పైత్యాన్ని జోడించి ..ఇలా ముంద‌స్తుగానే ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డిపోతూ ఉంటాయి. మంత్రి స‌త్యవ‌తి రాథోడ్ పీఆర్వో కూడా ఓ రెండు నెల‌ల కింద‌టి ప్రెస్ నోట్‌ను మ‌ళ్లీ అదే స‌బ్జెక్టు క‌దా అని పాత దాన్నేతోసేసి చేతులు దులుపుకున్నాడు. కాపీ పేస్ట్ ప్రెస్‌నోట్ చేసి హైద‌రాబాద్ మీడియా ముక్కున వేలేసుకున్న‌ది. అదీ మ‌న పీఆర్వోల ప‌నితనం.

You missed