ప్రభుత్వ ద్వంద్వ వైఖరి రైతును అయోమయం, గందరగోళానికి గురి చేస్తున్నది. వానాకాలం సీజన్‌లో వరిని ఒక్క గింజ లేకుండా కొంటామని ఆర్బాటంగా ప్రకటించింది. అదే సమయంలో యాసంగిలో వరిని అసలు వేయనే వద్దని గట్టి వార్నింగ్‌కు సిద్ధమైంది. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక ఒకటి అడ్డం రావడంతో ప్రస్తుతానికి వానాకాలం సీజన్ వరి ధాన్యం మొత్తం కొంటున్నామనే ప్రచారాన్నే బాగా ఫోకస్ చేస్తున్నది. వాస్తవంగా సీఎం ఆదేశాల మేరకు రేపటి నుంచి మూడు రోజుల పాటు విత్తన డీలర్లు, రైతులతో మీటింగులు పెట్టి వరి అసలే వేయొద్దనే అవగాహన సదస్సులు పెట్టాలి.
నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ మే రకు మీటింగులు పెట్టి డీలర్లకు వార్నింగులు కూడా ఇచ్చేశారు. కానీ రాత్రికి రాత్రే ఆదేశాలు మారాయి. రేపటి నుంచి చేపట్టాల్సిన అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలను వాయిదా వేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30 న ఉంది. ఇది ముగియకుండా వరి విషయంలో సర్కార్ కచ్చితమైన, కఠినమైన నిర్ణయం తీసుకుంటే.. ఇబ్బందులు వస్తాయని భావించింది. ఈ రెండు మూడు రోజులు ఆగితే.. హుజురాబాద్ ఎన్నిక ముగుస్తుంది.. అప్పుడు ఈ కఠినతరమైన ఆదేశాలు కచ్చితంగా అమలు చేయవచ్చనే భావనలో సర్కార్ ఉంది.
దొరికింది మోఖా అని సర్కార్ వరితో పాటు ఈ సీజన్‌లో మొక్కజొన్న వేస్తే కూడా మేం కొనమని తెగేసి చెప్పనుంది. గతంలో రైతుల వద్ద కొన్న మక్కలు వేస్ట్ అయ్యాయని, ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వరితోపాటు మొక్కజొన్న విత్తనాలు కూడా విక్రయించొద్దని డీలర్లకు కలెక్టర్ల ద్వారా గట్టి వార్నింగ్ ఇచ్చి వదిలింది. ఒకవేళ ఎవరైనా రైతు ఈ విత్తనాలు అడిగితే వారి రిస్కు మీదే అమ్ముకోవాలనే అగ్రిమెంట్‌తో ఇవ్వాలని, ప్రభుత్వానికి ముడి పెట్టి ఈ పంటలు పెట్టి ఇబ్బందులు పడొద్దని ముందస్తు సూచనలు, వార్నింగులు ఇవ్వాలని ఉచిత సలహాలు, గట్టి ఆదేశాలూ ఇచ్చారు.
సాగునీరు పెరిగింది. వరి విస్తీర్ణం పెరిగింది. దేశానికే అన్నం పెడుతున్నామని మీటింగుల్లో సీఎం సహా టీఆరెస్ నేతలంతా చెప్పుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు విషయానికి వచ్చే సరికి, కేంద్రం కొనడం లేదనే సాకుతో రైతును బ్లాక్‌మెయిల్ చేస్తూ ప్రకటనలిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రభుత్వానికి, రైతాంగానికి మధ్య అగాథాన్ని ఏర్పర్పచనుంది. హుజురాబాద్ ఎన్నిక తర్వాత రైతు మెడకపై కత్తి వేలాడదీసేందుకు సీఎం కేసీఆర్ రెడీగా ఉన్నాడు. ఈ యాసంగి సీజన్ కొత్త రైతు ఉద్యమాలకు నాంది పలుకుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.