నక్సలైట్లు ఉంటే బాగుండేది.. ఈ మాట అప్పుడప్పుడు కొందరి నేతల వెంట వస్తూ ఉంటుంది. తాజాగా రేవంత్ రెడ్డి నోటి వెంట కూడా ఇదే మాట వచ్చింది. నేతల్లో నిద్రాణమై ఉన్న వైర్యాగ్యానికి ఇది పరాకాష్టగా చెప్పుకోవచ్చు. నక్సలైట్లు అనే మాట ఒడిసిన ముచ్చట. అప్పటికీ ఇప్పటికీ చాలా కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. చైతన్యం వచ్చింది. ప్రశ్నించే తత్వం పెరిగింది. అన్యాయాన్ని ఎదిరించే స్వభావం అబ్బింది.
ప్రపంచమే కుగ్రామమైన ఈ రోజుల్లో నక్సలైట్లు, హింస, చంపడం.. దుర్మార్గాలు అంతమొందేవీ.. లాంటి మాటలు వినడానికే చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. రేవంత్‌లోని రాజకీయ ప్రష్టేషన్‌కు ఇది పరాకాష్ట అనుకోవచ్చు. కొన్ని సెక్షన్ల నుంచి ఈ మాటకు ఆయనకు మద్దతు లభించొచ్చు గాక, కానీ నేల విడిచి సాము చేసినట్టుగా ఆ మాటల్లో ఆంతర్యాన్ని, నేతల చాతగాని తనాన్ని, తమ నిర్లక్ష్యపు మాటలను ఈ విధింగా బయటకు చెప్పుకుని తమలోని డొల్లతనాన్ని, తెలివి తక్కువ తనాన్ని ప్రదర్శించుకోవడమే అవుతుంది తప్ప.. అవినీతి, అక్రమాలపై పోరాటే పోరాట పటిమ అనిపించుకోదు. ఇది పలాయనవాదంగా కూడా భావించొచ్చు.
సమాజంలో పేరుకుపోయిన, దారుణంగా ఉన్న పరిస్థితులను సరిదిద్దేందుకు ప్రత్యామ్నాయ మార్గమే లేదా? మళ్లీ అన్నలు తుపాకలు చేతబట్టి.. పిట్టల్లా నాయకులను, పోలీసులకు , దొరస్వాములను కాల్చి చంపితే తప్ప దుర్మార్గాలు అంతమొందవా..? మరైతే మీరంతా ఎందుకున్నట్టు…? రోజూ మీ మాటలు వినడం దుండుగేనన్నట్టు.. మీ పరిధిలో ఉన్న అధికారం, రాజకీయ పరపతితో ప్రజలను సంరక్షించే, దుర్మార్గలకు అడ్గుకట్టే వేసే శక్తియుక్తులు, తెలివి తేటలు మీకు లేవన్నమాట. అందుకే అప్పుడప్పుడు మీ నోటి వెంట ఇలాంటి పలాయనవాద పలుకులు రాలిపడుతూ ఉంటాయన్నమాట. మీలోని చేవలేని తనాన్ని ప్రజలకు తట్టిచూపుతూ ఉంటారన్నమాట.