టీఆరెస్ జిల్లా అధ్యక్ష పదవి లేకుండా ఉంటేనే నయమంటున్నారట మెజార్టీ టీఆరెస్ ఎమ్మెల్యేలు. గతంలో ఉన్నట్టుగానే జిల్లా అధ్యక్ష పదవి లేకుండా జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలతోనే సరిపెడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు ఎమ్మెల్యేలు సీఎం వద్ద తెలియజేసినట్టు తెలిసింది. అందుకే ఈ నియామక ప్రక్రియలో ఇంత తీవ్ర జాప్యమేర్పడుతూ వస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈసారి నుంచి జిల్లా అధ్యక్షులు ఉండాలని సీఎం భావించారు.
రానున్నది ఎన్నికల సమయం కావడంతో పార్టీ పట్ల కమిట్‌మెంట్‌తో పనిచేసే వారికి అధ్యక్ష పీఠం ఇవ్వాలని తద్వారా ఎన్నికల్లో వీరి సేవలు గణనీయంగా ఉపయోగించుకోవాలని కూడా ఆయన భావించారు. ఇప్పటికే సిట్టింగులకే టికెట్లు ఇవ్వడంతో చాలా చోట్ల వ్యతిరేకత ఏర్పడింది. మూడో సారి టికెట్ రాని వారు పార్టీ మారితే.. ఆ నియోజకవర్గంలో మొత్తం వారి టీం కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు టర్మ్‌లలో అంతా తమ మనుషులకే పదవులు కట్టబెట్టారు ఎమ్మెల్యేలు. జిల్లాపై పట్టు లేకుండా పోయింది.
ఏ నియోజకవర్గంలో వారే తమ పెత్తనం నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలను సమన్వయం చేసేందుకు ఎవరూ లేకుండా పోయారు. కొన్ని చోట్ల మంత్రులున్నా.. వారి మాట కూడా చెల్లుబాటయ్యే పరిస్థితి లేదు. తమ ఇలాఖాలో ఎవరూ జోక్యం చేసుకోవద్దనే ఎమ్మెల్యేల తీరు ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ మళ్లీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచన చేయడంతో కొంత మంది ఎమ్మెల్యేలకు ఇది నచ్చలేదు. ఇదే విషయాన్ని కేసీఆర్ ముందుంచినట్టు తెలుస్తోంది.
దీంతో ఈ విషయంలో కేసీఆర్ ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? మొన్నటిలాగే జిల్లా కమిటీల్లో అధ్యక్ష పదవి లేకుండానే కూర్పు చేస్తారా? లేదంటే కేసీఆర్ అనుకున్న ఆలోచన మేరకు అధ్యక్ష పదవులు ఇస్తారా? రేపు హైటెక్స్‌లో జరిగే ప్లీనరీలో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు నేతలు.