ఈ మధ్య హుజురాబాద్ ఉప ఎన్నిక రాజకీయ ప్రచారంలో గ్యాస్ బండ ప్రధాన భూమిక పోషిస్తున్నది. మొన్నటి బతుకమ్మ పండుగలో కూడా మధ్యలో గ్యాస్ బండ పెట్టి మహిళలతో బతుకమ్మలు ఆడించారు టీఆరెస్ వాళ్లు. తాజాగా ఓ మీటింగులో హరీశ్ రావు ఈ బండ లనే హైలెట్ చేస్తూ మీటింగు నడిపించాడు. మీడియాలో దీనికి పెద్ద ప్రాధాన్యత దొరకాలని ఆయన కోరిక.
గ్యాస్ ధర ఆమాంతం పెరిగి పేద ,మధ్య తరగతికి మరింత భారంగా మారింది. వాస్తవమే. ఖాతాల్లో వేస్తామన్న సబ్సిడీ అమౌంట్‌ను బంద్ చేసి ఏళ్లు గడుస్తుంది. పెట్రోల్ ధర ఏ రోజు ఎన్ని సార్లు ఎంత పెరుగుతుందో తెలియదు. పొద్దున లేస్తే లీటర్ పెట్రోల్ ధర చెప్పమంటే ఎవరి తరమూ కాదు. అంతటి గొట్టు ప్రశ్నలా తయారయ్యింది. పీఎం, సీఎంలు కూడా రేపు పెట్రోల్ ధర ఎంతుంటుంది..? అని అడిగితే మీమీదొట్టు వాళ్లు కూడా సరిగ్గా చెప్పలేరు. చేతులెత్తేస్తారు. అలా తయారయ్యింది పరిస్థితి.
గ్యాస్ బండ ధర కూడా అలాగే ఉంది. అదెప్పుడో వెయ్యి దాటింది. ఇంకెంత దాటుతుందో కూడా తెలియదు. ఎంత అడగితే అంతిచ్చి తీసుకోవడం, పెట్రోల్ ధర ఎంత పెరిగినా మూసుకుని కొట్టించుకుని వెళ్లిపోవడం మనం అలవాటు చేసుకున్నాం. అంతే.
సరే, ఇదంతా ఎందుకు కానీ, అసలు విషయానికొద్దాం. గ్యాస్ బండలతో ప్రచారం చేయడమంటే బీజేపీని ఆత్మసంరక్షణలో పడేసినట్టు. పెరిగిన ధర ఎలా ఉందో చూశారు కదా..? దీనికి ఎవరూ కారణం. మోడీ .. బీజేపీ. మరి మన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతాడు. మనమెలా అతనికి ఓట్లు వేయాలి…? ఒక్క గ్యాస్ బండ ప్రదర్శన వెనుక ఇంతటి లోతైన విశ్లేషణతో కూడిన భావం ఉందని హరీశ్ భావిస్తున్నాడు.
ఏదో అది అతని పిచ్చిగానీ… అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాడు. ఇదీ ఓ ప్రయత్నంగా, ఓ ప్రయోగంగా చేస్తున్నాడు. తప్పదు కదా. టీఆరెస్‌ను ఎలాగోలా గెలించుకు రావాలి కదా. పాపం తిప్పలు పడుతున్నాడు. అసలు విషయం ఏందంటే…. అసలు ఈటల రాజేందర్‌ను బీజేపీ అభ్యర్థిగా అక్కడ చూసే వాళ్ల సంఖ్య చాలా చాలా తక్కవు. ఏదో దిక్కులేక ఆ సమయానికి అదే దిక్కు.. ఆసరా అని బీజేపీలో చేరాడే తప్ప… హుజురాబాద్ ఎన్నికలో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి.. మోడీ , కేంద్ర వైఫల్యాలన్నీ ఈటల మెడకు చుట్టి.. లేవనీయకుండా చేసి, ఓట్ల రాలకుండా కట్టుదిట్టం చేసి.. ఘోరంగా ఓడిపోయేలా ప్రచారం చేసి… చావు దెబ్బకొట్టేలా కుయుక్తులు పన్ని…. ఇగో ఇలాంటివన్నీ వేస్టే. బీజేపీ కమలం గుర్తు పై పోటీ చేస్తున్నాడు. ఈటలను గెలిపించుకోవాలంటే.. కమలంకు వెయ్యాలె. వద్దనుకుంటే కారుకు వెయ్యాలే. గంతే బస్. ఈ రెండే బండ గుర్తులు అక్కడి ఓటర్లకు.
అంతే గానీ గ్యాస్ బండను చూడంగానే గుండె గుబగుబా మండి మోడీ గడ్డం పీకి గద్దె దింపాలన్న కసి పెరిగి.. ఆ పార్టీ గుర్తు మీద కసీ, కోపం పెరిగి… ఆ నీడన దాక్కున్న ఈటలను తక్షణం ప్రతీకారం తీర్చుకునే చాన్స్ దొరికిందని ఘోరంగా ఓటమి పాలు చేసి… తద్వారా మోడీ మీద కోపాన్నీ కసినీ ఈ విధంగా తీర్చుకుని….. ఇగో ఇలా ఆలోచిస్తారు కావొచ్చు ఓటర్లు అని హరీశ్ అనుకుంటున్నట్టున్నాడు. కానీ అక్కడ క్షేత్రస్థాయిలో రియాలిటీ వేరే ఉంది ట్రబుల్ షూటర్. అయినా నీకు తెలియనివా ఇవన్నీ.. ఏం చేస్తాం.. నీ ప్రయత్నం నువ్వు చేయాలె. ఫలితాన్నివ్వదని తెలిసినా కొన్ని ఇలా ప్రయోగించాలె.. ప్రదర్శించాలె.