మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ … కొత్త కథ. చికాకు తెప్పించే కథనం. జీర్ణించుకోలేని లాజిక్కులు. అర్థం కాని మలుపులు… ఎనలేని నీతులు.. చెప్పనలవి కాని కొత్త భాష్యాలు. అన్నీ కిచిడీల కలగలిపి.. తన పైత్యాన్నంత రంగరించి మన బొమ్మరిల్లు భాస్కర్ ఇలా వదిలాడు మన మీదకు ఈ సినిమాను. అక్కినేని అఖిల్ మొదటి నుంచి ఈ కథలో తేలిపోయాడు. నటనలో ఇంకా ఓనమాలే స్థాయిలోనే ఉన్నాయి.
రోమాన్స్ నేపథ్యంలో దీన్ని కొత్తగా తెరకెక్కించాలనుకున్న దర్శకుడి కొత్త ఆలోచన బాగానే ఉంది. కానీ చెప్పే విధానంలో చాలా కన్ఫ్యూషన్. తికమక పడి, తికమక పెట్టి అయోమయానికి గురి చేసి.. ఏదో చెప్పాలనుకున్నదాని చివరకంటూ లాక్కురావడానికి మధ్యలో పెట్టిన చెత్త సీన్లన్నీ నెత్తినొప్పి తెచ్చిపెట్టేటివే. మొదటి హాఫ్ అంతా బోరింగ్. రాసుకున్న డైలాగులు, సీన్లు బోరింగ్. చిన్న కథనే పెద్దగా తీయాలనే ఆలోచనతో చూసే ప్రేక్షకులను చాలా సార్లు వెర్రివెంగళప్పలను చేసి అలా రీళ్లను లాగించేసి సహనానికి పరీక్ష పెట్టాడు భాస్కర్.
అసలు అరేంజ్ మ్యారేజేస్ అన్నీ శుద్ధ వేస్ట్ అని చెప్పేశాడు ఓ దశలో తన కథ కోసం. ఇది రీజనబుల్‌గా లేదు. చాలా మంది దీన్ని అంగీకరించరు. ప్రేమకే కొత్త అర్థాన్ని చెప్పాడు.. అదే ఆరేంజ్ సినిమా తరహాలో. ఏదో తన మేథో సంపత్తినంతా ఇలా రంగరించి గొప్ప సినిమా తీద్దామనుకున్నాడేమో ఇలా చెత్త సినిమా అయి కూర్చుంది. ప్రేమ ఉంటే సరిపోదంటా… ప్రేమను వ్యక్తీకరించేందుకు రోమాన్స్ కావాలంట.
రోమాన్స్ అంటే సెక్స్ అని సూటిగా చెప్పలేకపోయాడు .. భయపడ్డాడేమో. దాన్నే అటూ ఇటూ తిప్పి రోమాన్స్ అంటే ప్రేమను వ్యక్తీకరించడం.. అలా ఎవరూ చేయడం లేదని కాంప్రమైజ్ సంసారాలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇదంతా తెచ్చిపెట్టుకున్న కల్చర్ కథలాగే ఉంది. మరి ఎంత మందికి ఈ కాన్సెప్ట్ నచ్చుతుంది..? చాలా మంది దీన్ని నిర్ధ్వంద్వంగా నిరాకరిస్తారు. వ్యతిరేకిస్తారు. సినిమా కథ విషయంలో కొత్తదే. ప్రయోగమే. కానీ ఇది వికటించే అవకాశాలే ఎక్కువున్నాయి. లహరాయీ.. లహరాయీ… పాట మినహా పాటలేవీ ఆకర్షించలేదు. వినసొంపుగా కూడా లేవు.
అఖిల్ హీరోగా నిలదొక్కుకోవడం ఇప్పట్లో అయ్యే పనిలా లేదు. చాలా కష్టపడాలి. ఎంత కష్టపడ్డా ఆ ఆ పాలుగారే బుగ్గలు, అమాయకపు మోము, ఆ చూపు… అభినయానికి సూట్ కాలేదు. పూజాహెగ్డే నటనలో పరిపక్వత కనిపించింది. డైలాగ్ డెలివరీ, నటన, హావాభావాలలో పూర్తి మెచ్యూరిటీ కనబర్చింది. దీంట్లో కూడా డైరెక్టర్ ఆమె తొడలనే నమ్ముకున్నాడు. అవి కూడా బాగా పనికి వచ్చాయి సినిమాకు.
కంగాళీ కథ. కైమాక్స్ పేలవం. మొదటి నుంచి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చిన డైరెక్టర్ .. క్లైమాక్స్ భారీతనంతో, భారీ డైలాగులతో అన్నీ పోగొట్టుకోవాలనుకున్నాడు. కానీ లేవలేకుండా చతికిలబడ్డాడు. హీరోయిన్ కు పెళ్లి, ప్రేమ విషయంలో ఎలా ఉండాలో రాసిన డైలాగులు బాగున్నాయి. ఆమె చెప్పిన తీరు, కనబర్చిన నటన కూడా బాగుంది. అలాంటి మెచ్యూరిటీ పాత్రను.. సెకండ్ హఫ్‌లో హీరోను లేపేందుకు హీరోయిన్‌ను మరీ తక్కువ చేసి చూపించాల్సి వచ్చింది డైరెక్టర్‌కు.