కారు మీదో, బైక్ మీదో మనకో పరపతి సింబల్ కావాలి. అది చూడగానే అందరూ మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. వీడో తోపురా అని మనకు సైడ్ ఇవ్వాలి. వీలైతే ఓ నమస్తే కూడా రావాలి వారి నుంచి. ప్రెస్, పోలీస్, ఆర్మీ.. ఇలా ఏ పేర్లు రాసుకున్నా.. ఆ విధంగా మన పరపతిని జనానికి చూపాలనుకుంటాం. భయపెట్టాలనుకుంటాం. మర్యాద రాబట్టాలనుకుంటాం. గౌరవాన్ని అడుక్కుని మరీ కోరుకుంటాం. ఇలా చాలా మందికి అలవాటు. అరేయ్ నేను ఇదిరా.. నన్నాపకురోయ్..! నీకు మూడుతుంది..!! నాతో పెట్టుకుంటే అంతే…!! అనే రేంజ్‌లోనే ఉంటాయి ఆ రెడ్ కలర్ రేడియంలోని పేర్లు.
ప్రెస్ అంటే రిపోర్టర్. రిపోర్టర్‌తో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏది పడితే అది రాసేస్తాడు. అది పిచ్చోడి చేతిలో రాయి అన్నమాట. సీతయ్య ఎవరిమాట వినడు.. అన్నట్టు.. తనను ఎవరైనా ఆపితే మాత్రం అది దేశద్రోహంగా చూస్తారు. అంతకన్నా అవమానం మరొకటి ఉంటుందా? తక్షణం ఆ ఆపినవాడి అంతు చూడాలి. వాడి డ్రెస్ మీదున్న పేరు మీద పడుతుంది. మనసు మననం చేసుకుందా పేరును. బిడ్డా చూస్తా నీ పని అని పళ్లు పటపటా కొరికి ఓ ఉరుము ఉరిమి చూసి కళ్లోతోనే భయపెడతాడు. నిజంగా విలేకరి కాకుండా తూట్‌పాలిష్ విలేకరి అయితే కాళ్లబేరానికి వచ్చి సార్ సార్ నేను రిపోర్టర్న్ సార్… నన్నొవదిలేయండి.. అని బతిమాలి అలా తుర్రున జారుకుంటాడు.
ఇక పోలీస్ అని రాస్తే మాత్రం ఆపే ధైర్యం ఆ నాలుగో సింహాలు కూడా సాహసించవు. మర సేమ్ డిపార్ట్మెంట్ కదా.. రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకోవాలి కదా. మీది తెనాలే.. మాది తెనాలే టైపన్నమాట. సరే, ఇదంతా ఎందుకు కానీ, రైతు అని ఎవరన్నా తమ కారు మీద రాసుకున్నారా? రైతా..? అంటే పోలీసులు రెస్పెక్ట్ ఇస్తారా? ఆపకుండా వదులుతారా? అసలు మర్యాద దొరకుతుందా? భయపడతారా? ఇప్పుడున్న వారికి ఇన్ని డౌట్లు వస్తాయి. పాపం వాళ్లకు తెలియదు. ప్రెస్, పోలీస్ అంటే తప్ప పోలీసుల్లో వదలరని. మరి అలాంటప్పుడు రైతు అని రాసుకొని నవ్వులపాలు కావడమెందుకంటారా? అవును ఇదీ నిజమే.
కానీ వరంగల్ జిల్లా దమ్మన్నపేటకు చెందిన అబ్బిడి శ్రీనివాస్‌రెడ్డి అనే రైతు భూమినే నమ్ముకున్నాడు. వ్యవసాయమే జీవనాధారంగా బతికాడు. ఇంతింతై వటుడింతై లాభాల సాగు చేసి 20 ఎకరాల ఆసామి అయ్యాడు. అన్నీ కలిసొచ్చాయి. ఓ కారు కూడా కొన్నాడు. అందిరిలా తన కారు ఫ్రంట్ మిర్రర్‌పై తనంటే ఏందో? తన ఐడెంటిటీ ఏందో తెలియజేయాలనుకున్నాడు. అనుకున్నదే తడువు.. తనను నిలబెట్టిన, పరపతి పెంచిన, సమాజంలో గౌరవం తెచ్చిపెట్టిన భూమిని తలుచుకోవాలనుకున్నాడు. ఆ భూముని నమ్ముకుని రైతుగా వ్యవసాయం చేసి ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు కాబట్టి.. యెస్.. నేను రైతును అని సగర్వంగా చెప్పదలుచుకున్నాడు.
అందుకే అద్దంపై రైతు అని రాసి పెట్టుకుని గర్వంగా చాతిని ఉబ్బించి ..చూడండి.. రైతుకు ఉన్న పరపతి ఏందో..? గౌరవం ఏందో.. నాకైతే ఇది ఎంతో గర్వంగా ఆనందంగా ఉంది అంటూ స్నేహితులతో చెప్పుకుని మురుస్తున్నాడు. ఇప్పుడు శ్రీనివాస్‌రెడ్డిని చూసి రైతులంతా మనమే రాజులం…అదే రాసుకుందాం.. అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడిదో కొత్త ట్రెండ్. ఆ పేరకు పెట్టిన కిరిటీం. ఆ వృత్తికి ఇస్తున్న గౌరవం. అన్నదాతకు వచ్చిన ఎనలేని కీర్తి ప్రతిష్టలకు తార్కాణం.