కావాల్సినంత డబ్బు, ఆకాశమే హద్దుగా స్వేచ్ఛ, పట్టించుకునేవారు ఉండరు, పట్టింపులు అసలే ఉండవు.. చెడిపోవడానికి ఎన్నో మార్గాలు, అడ్డుకోవడానికి ఒక్కమార్గమూ ఉండదు. డ్రగ్స్ ,అమ్మాయిలు.. చిటికేస్తే వచ్చి వాలే వనరులు వాళ్లకు. అదో ప్రపంచం. అదో జగత్తు. మత్తు,మందు, మగువ .. ఎంతో గమ్మత్తు ఆ యువతకు. ఉన్నత వర్గాలకు చెందిన పుత్ర రత్నాలు చెడిపోవడానికి ఇన్నిమార్గాలుంటాయి. కేవలం వీటిపైనే అని వదిలేయడానికి లేదు. వీటికన్నా పెద్ద జబ్బేంటంటే… ఇన్ని ఇచ్చి చెడిపోవడానికి కారణమైన ఆ తండ్రి. అవును.. ముమ్మూటికీ.. వాళ్లలా చెడిపోవడానికి ఆ తండ్రే కారణం.
ఓ సనిమాలో ప్రకాశ్ రాజ్ అంటాడు… నేను కష్టపడి రిక్షా తొక్కానని, నా కొడుకు కూడా నాలాగే కష్టపడాలా? వాడూ రిక్షా తొక్కాలా? అని. తనలా తన కొడుకు కష్టపడొద్దు అని అనుకోవడమే అతి గారాభానికి తొలిమెట్టు. నీలాగా రిక్షా తొక్కమనడం లేదు. స్వయం కృషితో పైకి రావాలని అనేది. తన కాళ్లపై తాను నిలబడాలని కోరేది. లోకరీతి తెలుసుకుని సమాజంలో ఎలా బతకాలో నేర్పాలి అని చెప్పేది. కానీ ఉన్నతవర్గాల పిల్లల తండ్రులు.. అలా గాలికొదిలేస్తారు. పట్టించుకోరు. కావాల్సింది సమకూరుస్తారు. డబ్బు, దస్కం.. అన్నీ. కొందరు గారాభం వల్ల. ఇంకొందరు పరపతి సింబల్‌గా. మరికొందరు పర్యవేక్షణ చేసే టైమ్ కూడా లేక అలా గాలికొదిలేస్తారు.
ఇదంతా సోది ఎందుకంటారా..? కాట్‌పల్లి సంతోష్‌రెడ్డి ఫేస్‌బుక్ వాల్ మీద ఓ పోస్ట్ కనిపించింది. జాకీచాన్ కుమారుడు కూడా సేమ్ మొన్న షారూఖ్ కొడుకు లెక్కనే డ్రగ్స్ కేసులో దొరికాడంట. కానీ ఇప్పుడు షారూఖ్ నిర్లక్ష్యంగా స్పందించనట్టు అతను స్పందించలేదట. శిక్ష పడాలని కోరుకున్నాడట. క్షమాపణ కూడా చెప్పాడట. అదీ ఇద్దరి మధ్య తేడా అని చెబుతున్నాడు.
కొందరు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారు. కొందరు చేతులు మూతులు కాలాక కూడా సమర్థించుకుంటారు. అలా వారి పుత్రోత్సాహం.. వారి కొంపలే కాదు మంది కొంపలు కూడా ముంచుతుందన్నమాట.