సమంత, నాగ చైతన్య విడాకులు ఎపిసోడ్ కార్తీక దీపం సీరియల్లా జీడిపాకంలా సా..గి సా….గి మొత్తానికి ఈ రోజు శుభంకార్డు పడింది. వాళ్లు విడిపోయేదాక మనవాళ్లు వదల్లేదంటే నమ్మండి. రోజుకొక వార్త. పూటకో పుకారు. విడిపోయారట.. లేదు.. నాగార్జున మాట్లాడిండట. అంతా సర్దుకున్నదట. ఏహె ఊకో.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారంట… అబ్బబ్బ.. ఎన్ని వార్తలో. అసలు ఏది నిజమో..? ఏది అబద్దమో తెలియక.. తికమక పడి… అన్ని సైట్లూ వెతికి, యూట్యూబ్‌ల్లో గాలించి, వార్తావిశేషాలను ఎప్పటికప్పుడు జల్లెడపట్టి.. నిద్రాహారాలు మాని, కలత నిద్రతో కలవరం చెంది.. అదేదో దేశ సమస్యలా మనల్ని వెంటాడి.. వేధించి, బాధించి…. ఇలా మొత్తానికి ఓ ముగింపునిచ్చి ఉసూరుమనించింది.
అదేంటీ..! విడాకులు తీసేసుకున్నారు కదా. ఇకనైనా కళ్లు సల్లబడ్డాయా? ఇంక ప్రశాంతంగా ఉంటారా? అని అనుకుంటున్నారా? ఊహు.. ఇప్పుడు మళ్లా మాకు కొత్త సమస్య. వీరిద్దరూ విడిపోతే ఎందుకు విడిపోయారు? అసలు కారణం ఇదేనా? అని యూట్యూబ్‌ల్లో వచ్చే వార్తల కోసం ఇప్పుడు కళ్లు కాయలు కాచేలా చూస్తాం. మళ్లా మా చై ఎవరితో ప్రేమలో పడనున్నాడు. ఎవరా అందాల భామ..? అనే విషయాలు మాకు ఎప్పటికప్పుడు తెలియాలి. ఆ సామ్ ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? వాడు మా చై కన్నా అందగాడా? అంతసీన్ లేదు.. ఆ వార్తలను వడపోసి పట్టాలి. అసలే చై లవ్‌స్టోరీ సినిమా తన్నేసింది. ఇప్పుడు సామ్ కూడా తన్నేసింది. ఇక తన్నేయడాలు ఆగుతాయా? మా చై కి మంచి రోజులు వస్తాయా? ఇంత డిప్రెషన్లో ఏ సినిమాకు ఒప్పుకున్నాడు? అది కూడా తన్నేయదు కదా? అబ్బబ్బ ఎన్నెన్ని ప్రశ్నలు.. ఎన్నెన్ని అనుమానాలు..? కుటుంబం గురించి, కుటుంబ సభ్యుల గురించి కూడా ఇంతలా ఆలోచించం బ్రదర్. కానీ వీళ్ల గురించి మాత్రం బుర్ర వేడెక్కెలా ఆలోచనలు చక్కర్లు కొడుతున్నాయి.