నిజామాబాద్ న‌గ‌ర న‌డిబొడ్డున.. అర్ధ‌రాత్రి.. సీపీ క్యాంపు కార్యాల‌యానికి కూత‌వేటు దూరంలో ఓ డిగ్రీ అమ్మాయి పై న‌లుగురు కామాంధులు సామూహికంగా అత్యాచారం చేసిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌కలం రేపింది. నిజామాబాద్ బ‌స్టాండ్‌లో ఓ షాపు న‌డుపుకునే కుర్రాడు ఆర్మూర్‌కు చెందిన డిగ్రీ సెకండియ‌ర్ చ‌దువుతున్న అమ్మాయి (22)తో ప్రేమ పేరుతో వ‌ల వేశాడు. మంగ‌ళ‌వారం రాత్రి బ‌స్టాండ్‌కు పిలిపించుకున్నాడు. రాత్రి వ‌ర‌కు వెయిట్ చేయించాడు. రూం కోసం అన్వేషించాడు.

బ‌స్టాండ్ ప‌క్క‌నే ఉన్న తిరుమ‌ల న‌ర్సింగ్ హోంలో సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తున్న అత‌ని స్నేహితుని స‌హాయం కోరాడు. త‌న‌తో పాటు కోట‌గ‌ల్లీ నుంచి మ‌రో ముగ్గురు దోస్తుల‌ను ర‌ప్పించాడు. అమ్మాయికి కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి ఇచ్చాడు. వీరు చిత్తుగా మందు తాగారు. సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అమ్మాయి స్పృహ కోల్పోయి ఓ రూంలో వివ‌స్త్ర‌గా పడి ఉండ‌గా ఈ న‌లుగుగు కామాంధులు హాస్పిట‌ల్ ముందు హంగామా చేశారు. ఒక‌రు చూసి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విషయం వెలుగు చూసింది. బాధితురాలిని స‌ఖి సెంట‌ర్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. న‌లుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తిరుమ‌ల న‌ర్సింగ్ హోం ప్ర‌స్తుతం మూత‌ప‌డ్డ‌ది. రిపేర్లు న‌డుస్తున్నాయి. ద‌స‌రా నుంచి దీన్ని ప్రారంభించాల‌ని మేనేజ్‌మెంట్ భావించింది. కానీ అక్క‌డ స‌రైన సెక్యూరిటీని నియ‌మించ‌లేదు. ఇదే కామాంధుల‌కు అవ‌కాశంగా మారింది. మ‌రోవైపు అదే లైన్‌లో ఓ లాడ్జిలో నిత్యం వ్య‌భిచారం న‌డుస్తూ ఉంటుంది. ప‌గ‌లు, రాత్రి తేడా ఉండ‌దు. కానీ పోలీసులు ప‌ట్టించుకోరు. సాయంత్రం 7గంట‌ల తర్వాత మ‌హిళ‌లు అటు వెళ్లాలంటేనే జంకుతారు. అలాంటి భ‌యాంక‌ర‌మైన ప‌రిస్థితులు బ‌స్టాండ్ చుట్టు ప‌క్క‌ల ఉన్నాయి. బ‌స్టాండ్‌లో కూడా కాలేజీ అమ్మాయిల‌ను టార్గెట్ చేస్తూ ఆక‌తాయిల వేధింపులు ఎక్కువవుతున్నాయి. అయినా ప‌ట్టింపులేదు. డిగ్రీ అమ్మాయి పై జ‌రిగిన ఈ దారుణం గురించి మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ సునీత ల‌క్ష్మారెడ్డి ఆరా తీసింది. నిందుతుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ఆదేశించింది.