నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు ఉపయోగపడే కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. దాదాపు దశాబ్ధ కాలంగా ఈ పనులు నడుస్తూనే ఉన్నాయి. అంచనా వ్యయం పెంచుతూ పోయారు. మొత్తం రూ. 240 కోట్లు ఖర్చు చేసి 400 కి.మీ మేర నగరంతో పాటు నగరం చుట్టు ప్రక్కల పైపులైన్ పనులు పూర్తి చేశారు. సీవరేజ్ ట్రిట్‌మెంట్ ప్లాంట్(stp) ఏర్పాటు చేశారు. ఒక 20 శాతం మాత్రమే ఇండ్లలోని మురుగు నీరు పోయేందుకు కనెక్షన్లు ఇచ్చారు. అసలు కథ ఇక్కడే ఉంది. అంతకు ముందు ఎల్అండ్‌టీ కంపెనీ పనులు చేసింది. దాదాపు 300 కి.మీ ఇన్నర్ వైపులైన్స్ వేసింది. ఇందులో డమ్మీలను పెట్టింది. ఇప్పడు డమ్మీలు తీసేయాలి.. గ్యాపులు పూడ్చాలి. దీని కోసం మరో రూ. 30 కోట్లు కావాలి. ఈ నిధులు ప్రభుత్వం ఇచ్చేలా లేదు. అధికారులు లేఖ రాసి ఏడాదికి ఎక్కువైంది. ఇంకా దీనిపై ఎలాంటి స్పందన లేదు. ఎల్ఎన్‌టీ చేపట్టిన 300 కి.మీ మేర పైపులైన్ గ్యాపులు పూడిస్తే తప్ప ఆ పరిధిలోని ఇండ్లకు కనెక్షన్లు ఇవ్వడం కుదరదు. దీంతో ఈ పనులు పూర్తయ్యయని చెప్పుకుంటున్నప్పటికీ కీలకమైన నగరం నడిబొడ్డున గ్యాపులు ఉండడంతో పూర్తి స్థాయిలో యూజీడీ వినియోగంలోకి రాలేదు.
