ఆర్టీసీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలసారిగా జిల్లాకు వచ్చిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఘన స్వాగతం పలికారు నేతలు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డికి.. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ఆర్టీసీ చైర్మన్‌గా కార్పొరేషన్ పదవిని ఇచ్చాడు. మంత్రిగా అవకాశం వస్తుందని బాజిరెడ్డి ఎదురుచూశాడు. బీసీ నేతగా, సీనియర్ ఎమ్మెల్యేగా ప్రభుత్వం గుర్తిస్తుందని భావించాడు. ఆర్టీసీ చైర్మన్‌గా ఇచ్చింది ప్రభుత్వం. బాజిరెడ్డికి మాస్ లీడర్‌గా రూరల్‌లో, జిల్లా వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. అడిగిందే తడవు తమకు పనిచేసి పెడతాడని, ఎప్పుడు ఏ ఆపద వచ్చినా.. నేనున్నానంటూ భరోసా ఇచ్చి ఆదుకునే నేతగా గుర్తింపు పొందాడు. ఆయన నివాసం ఎప్పుడూ జనాలతో కిటకిటలాడుతూ ఉండటమే దీనికి నిదర్శనం. మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన బాజిరెడ్డికి ఎట్టకేలకు పదవి వరించింది. దీంతో అభిమానులు, కార్యకర్తలు, నాయకుల్లో సంతోషం వెల్లివిరిసింది. ఆదివారం ఆయన రాకను పురస్కరించుకుని అంతా కోలాహాలంగా మారింది.
