అంతా గందరగోళం. ప్రాజెక్టులు పూర్తవుతున్నాయనే సంతోషం. వాటి ద్వారా సాగునీరందుతుందనే సంతోషం. తద్వారా వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగిందనే గర్వం. మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడానికి ఇంతకు మించిన సాక్షమేమి కావాలనే విజయానందం. చేసిన పనిని, జరిగిన లాభాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవడంలో తప్పేముందనే గడుసుతనం..
ఇవన్నీ ఒకవైపు. కానీ లాజికల్‌గా ఆలోచిస్తే. వాస్తవాలను మాట్లాడుకుంటే. ఆ పెరిగిన వరి అటు ప్రభుత్వానికి ఉరిలా మారుతుంది. రైతు ఈ మూస సాగు ఆలోచనలలోనే మునిగిపోతున్నారు. కొత్త ఆలోచనలు రావు. సంస్కరణల జోలికి అసలే పోరు. ప్రత్యామ్నాయ పంటలంటే భయం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్టూ ఉండదు. కానీ, పైన మనవాళ్లు విజయగర్వంతో చెప్పుకున్న ప్రాజెక్టులు.. సాగునీరు.. పెరిగిన వరి…. ఇక్కడ అతకదు.
ఇక్కడ వేరే పలుకులు పలుకుతారు. ప్రాజెక్టులు వరిసాగు కోసం కాదంటారు. ప్రత్యామ్నాయ పంటలకంటారు. ప్రత్యామ్నాయ పంటలకు అన్ని నీళ్లు అవసరమా? అని ఎవరూ అడగరని అనుకుంటారు. పుష్కలంగా నీళ్లున్నప్పుడు ఈజీగా అలవాటు పడ్డ వరికే పోతారు కానీ, ఇంకా వేరే పంటలేమేస్తారు? మీది మీకే క్లారిటీ లేదు. రెండ్రెండు మాటలు. రెండు సందర్భాల్లో రెండు ప్రకటనలు. మరి రైతులకు క్లారిటీ వచ్చేదెలా? భరోసా ఇచ్చేదెవరు? అన్నీ మాటలే. చేతలు లేవు. ఇది తెలంగాణలో నడుస్తున్న పరస్పర విరుద్ధ అభిప్రాయాల సందర్భం.
ఒక్కరు కాదు.. అందరు నేతలదీ అదే దారి. సీఎంతో సహ. నష్టం అంటారు. గర్వకారణమంటారు. ఇంకా ఎన్ని రోజులు ఇవే మాటలు. ఏదో ఒకటి చేయండి. పీకల మీదకు వచ్చే వరకు ఇలా మాటలతో గడిపితే.. అటు ప్రతిపక్షాలకు అస్త్రాలను ఇచ్చినవారవుతారు.