ఎన్నో రోజుల సస్పెన్స్. బహుశా ఏ ఉప ఎన్నిక విషయంలో కూడా ఇన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకోలేదనుకుంటా. ఇన్ని శక్తులు మోహరించలేదనుకుంటా. సీఎం కేసీఆర్ ఇంతగా ఎప్పుడూ మొండిగా పంతం పట్టలేదనుకుంటా. అవును… హుజురాబాద్ అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నది. అలా అది ప్రాధాన్యత సంతరించుకునేలా చేసింది కేసీఆరే. ఈటల రాజీనామా తర్వాత ఎప్పుడు ఎన్నిక వస్తుందా? తీర్పు ఎలా వస్తుందా? అని ఆసక్తిగా చూసిన జనానికి నిరాశే ఎదురయ్యింది. ఎన్నికల షెడ్యూల్ కావాలనే లేట్ చేసింది ఎన్నికల కమిషన్. ఇక ఇప్పట్లో ఎన్నిక ఉండదనే వైరాగ్యం కూడా వచ్చేసింది బీజేపీ నేతలకు. ఇవన్నింటికీ తెర దింపుతూ.. ఇవాళ ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 30న ఉప ఎన్నిక, నవంబర్ 2న ఫలితాలు.
హమ్మయ్య…! ఓ పనైపోయింది. ఇక అసలైన పనే మిగిలి ఉంది. అదే క్షేత్రస్థాయిలో కదనరంగంలో పోరాటం. నువ్వా నేనా అని తేల్చుకునే బృహత్తరమైన, వీరోచిత పోరాటం. దాని కోసమే జనాలంతా చూస్తున్నారు. రాష్ట్రమంతా అటువైపే దృష్టి పెట్టింది. అలా చేశాడు మరి కేసీఆర్. అక్కడ్నే పథకాలు, అక్కడ్నే పదవులు. అక్కడ్నే తిష్ట. అక్కడ్నే శక్తుల మోహరింపు, అక్కడ్నే నిధుల గుమ్మరింపు. అదే కేంద్రంగా పాలన. అబ్బ… ఇన్ని వింతలు బహుశా భవిష్యత్తులో ఇక చూడలేమోమో. అంతలా విస్తుపోయేలా చేశాడు కేసీఆర్. ఎందుకో మరి.
ఇంత చేసినా.. ఏదో భయం టీఆరెస్‌లో. హరీశ్‌రావైతే… పండుగ లేదు పబ్బం లేదు.. ఆడనే ఉంటుండు. ఏవేవో హామీలిస్తుండు. తనే కేసీఆర్‌లాగా భావించండి అనే రేంజ్‌లో మాట్లాడుతుండు. అబ్బబ్బ.. ఒక్క రాజేందర్ వల్ల ఎన్ని కష్టాలొచ్చాయో కదా కేసీఆర్‌కు. పగవాడికి కూడా రావొద్దు ఇలాంటి దుర్దినాలు.
ఇంకో కొత్త విషయం ట్రోల్ అవుతున్నది. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి రాజేందర్‌కు కాకుండా.. ఆమె భార్యకు టికెట్ ఇవ్వాలని కోరాడట. ఇదేం ట్విస్టో మరి. ఈ రాజకీయాలు ఒక పట్టాన అర్థం కావు సుమండీ..! కేసీఆర్ కోణంలో చూస్తే తప్ప.
