అదో సినీ మాఫియా. దానికి తిరుగులేదు. డ్రగ్ మాఫియాలా అది వేళ్లూనుకుంది. ఎంతటి వారినైనా లొంగదీసుకుంటుంది. గ్లామర్ ప్రపంచంలోని మత్తును చల్లి మైకాన్ని కలిగిస్తుంది. డబ్బును గుమ్మరించి .. గంపకింద కమ్మేస్తుంది. ఆంధ్ర అంటేనే సినీ మాఫియా. మర్ర చెట్టులా ఏళ్ల తరబడి ఎదిగిన వట వృక్షాలక్కడున్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. సీఎం ఎవరైనా.. అంతా అనుకున్నట్టే జరగాలి. సినీ పెద్దలకు రాజకీయ పెద్దలు అవసరమైతే దాసోహం అనాలె. కానీ ఇప్పుడంతా ఆంధ్రలో అంతా రివర్స్ జరుగుతున్నది.
సినీ పెద్దలకు సీఎం జగన్ మొండి మొగుడులా మారాడు. ఎంతకూ వినడు. చెప్పి చెప్పీ అలసిపోయారు పెద్దలు. ఓ దశలో చిరు లాంటి మెగా వట వృక్షం కూడా వైరాగ్యంలోకి వెళ్లి ఏమి మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడేస్తున్నాడు. జగన్ దెబ్బ అలా తగిలింది మరి. దిమ్మదిరిగి వెండితెరపై కనిపించాల్సిన బొమ్మ కళ్లముందే కనిపిస్తుంది. కానీ మసగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే కళ్లు బైర్లు కమ్మేలా ఉంది దెబ్బ.
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ పేరుతో జగన్ ఇప్పుడు .. సినీ ఇండస్ట్రీకి కలెక్షన్ కింగ్‌లా మారాడు. అంతు చూస్తున్నాడు. లోపల ఉన్న కసంతా కక్కుతున్నాడు. అప్పుడు వాళ్లు చూపిన వివక్ష తాలుకూ శిక్షను చక్రవడ్డీ, బారువడ్డీ వేసి మరీ వాయించేస్తున్నాడు. తనే వసూలు చేస్తానంటూ వసూళ్ల రాయుళ్ల రాబడులకు గండికొట్టాడు. ఇప్పుడు అక్కడంతా లాస్ కలెక్షన్. ఏదో సినిమాలో .. కలెక్షన్ నిల్లు బాలు.. బతుకు బస్టాండు పాలు.. అని పాడుకుంటున్నట్టుగా మారింది అక్కడ సినిమాల పరిస్థితి.
తెలంగాణలో కంటే ఆంధ్రలోనే సినిమాల పిచ్చి ఎక్కువ. ఎగబడి ఎగబడీ చూస్తారు. నాలుగే షోలుండాలి. ప్రాఫిట్ షోలు ఉండొద్దు. టికెట్టు మేమే అమ్ముతాం. మేమే పైసలిస్తాం… లాంటి షరతులతో బిక్కచచ్చి..చచ్చీ చెడీ.. బతకలేక చచ్చి.. తిట్టలేక తిట్టుకుని… బయటకు మాత్రం నవ్వుతూ మాట్లాడి … లోపల వైరాగ్యంతో రగిలిపోయి… ఛీ దీనమ్మ బతుకు.. అని కసితీరా తిట్టుకుని గొంతుల దాకా సారాతో నింపి ..ఆ రోజుకా బాధ మరిచి.. రాత్రి కలలో జగన్ కనిపించగానే చటుక్కున లేచి మిగిలిన బాటిల్‌లోని సారాను లక్కీ డ్రాప్ వరకూ పట్టించి ఎప్పుడో తెల్లారుజాముల్లో నిద్రపోతున్నారంట ఆంధ్ర సినీ పెద్దలంతా.