డ్రగ్స్ కేసు అటూ ఇటూ తిరిగి కేటీఆర్ మెడకు చుట్టుకునేలా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఎప్పుడైతే ఈడీ మళ్లీ ఈ డ్రగ్స్ కేసును తిరగదోడి మనీ ల్యాండరింగ్ కేసులో మళ్లీ విచారణ చేపట్టడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి దీన్ని రేవంత్‌రెడ్డి అస్త్రంగా వాడుకుంటున్నాడు. పాత కేసుకు, కొత్తగా విచారణ చేపడుతున్న సంఘటనలకు పొంతన లేకపోయినా దగ్గుబాటి రాణి, రకుల్‌ప్రీత్ సింగ్‌లను అప్పుడు ఎందుకు పిలిపించలేదని, ఇప్పుడెందుకు రప్పించారని రేవంత్ ప్రశ్నిస్తూ వస్తున్నాడు. అప్పుడు వీరిద్దరు విచారణకు హాజరు కాకుండా కేటీఆర్ అడ్డుకున్నాడని ఆరోపించాడు.
డ్రగ్స్ కేసులో కేటీఆర్ సినీ తారలను తప్పిస్తున్నాడనే ఆరోపణలు చేయడంతో కేటీఆర్ కూడా గత్యంతరం లేక స్పందించాల్సి వచ్చింది. ఇక్కడే రేవంత్ రెడ్డి తన వ్యూహ రచనలో సక్సెస్ కాగలిగాడు. మెల్లమెల్లగా రేవంత్ విరిసిన ఉచ్చులో ఇరుక్కుపోతున్న కేటీఆర్‌ను మరింత ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్. ఒకరికొకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. లై డిటెక్టర్ టెస్టుకు రేవంత్ సిద్ధమేనా అని కేటీఆర్ అడగడంతో పాటు ఢిల్లీలో తను డ్రగ్స్‌కు సంబంధించిన శాంపిల్స్ ఇస్తానని, రాహుల్ కూడా ఇవ్వాలని ట్వీట్ చేశాడు. తన స్థాయి చంచల్‌గూడ జైల్లో శిక్ష అనుభవించిన వారితో కాదని రేవంత్‌ను ఘాటుగా విమర్శించాడు.
అయితే వైట్ ఛాలెంజ్ పేరుతో గన్‌పార్కు వద్దకు రావాలని రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు సవాల్ విసిరాడు. దీన్ని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని హంగామా చేశారు. అదే సమయంలో కేటీఆర్ పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించడంతో దీన్ని కూడా రేవంత్ తిప్పికొడుతూ ప్రజలకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేయకుండా కోర్టుకు వెళ్లడం ఏంటనీ.. ప్రతి అంశాన్ని కేటీఆర్‌ను ఆత్మసంరక్షణలో పడేసే విధంగా రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. కేటీఆర్ తనకు తెలియకుండానే ఉచ్చులో పడిపోతున్నాడు. కాంగ్రెస్ ఈ డ్రగ్స్ కేసును మొత్తంగా కేటీఆర్ మెడకు చుట్టి అతన్ని నైతికంగా దెబ్బ తీసేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నది.