భార్య‌ నిష్టూరంగా ఈ మాటలన్నా.. అవి నేరుగా రాజారెడ్డి మనసులో గుచ్చుకున్నాయి. ఒక్కసారి గుండె కలుక్కుమన్నది.
రోజూ మేనేజ్ మెంట్ పెట్టే టార్గెట్ల కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఎవరెవరినో కలుస్తున్నాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా భయం మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంది. ఏ కొద్దిపాటి జ్వరం వచ్చినట్లున్నా
కంగారు పుడుతుంది. అది కరోనానే అనే భయం వెంటాడుతుంది. రాత్రంతా ఇదే భయంతో నిద్ర సరిగా రాక జాగరణ చేయాల్సి వస్తుంది. ఆ నిద్రలేమితో కొద్దిగా తలనొప్పి వస్తే అది కూడా కరోనా లక్షణమేనా? అనే అనుమాన బీజం మొలకెత్తుతున్నది. అనుమానం పెనుభూతంలా మారి నిత్యం నరకం కనబడుతున్నది. ఏవేవో మందులు మాత్రం మింగాల్సి వస్తుంది. సొంత వైద్యమే ఇపుడు దిక్కయ్యింది. కరోనా వస్తే అటు సర్కారు దవఖానలకు పోలేము. ఇటు ప్రైవేటులో చేతి చమురు వదిలించుకోలేము. ఆస్తులమ్మి, అప్పులు చేసి బిల్లులు కట్టలేము. హెం ఐసోలేషన్లో ఉందామంటే ఇరుకు గదులు, కిరాయి కొంపలు. ఎప్పుడు కరోనా కాటేస్తుందో తెలియని భయం ఓవైపు.. జీవన పోరాటం మరోవైపు … ఎంత క్లిష్ట సమయం అంటే గతంలో ఎవ్వరికీ ఇలాంది దుర్గతి పట్టి ఉండదు. పేద, మధ్య తరగతి వర్గాలకు జీవన్మరణ సమస్యగా మారింది. తెల్లారితే ఏం జరుగుతుందో… ? తెలియని దుర్భర జీవితాలను నెట్టుకొస్తున్నారు. సర్కారు దవాఖనపై నమ్మకం పోయింది.
ప్రైవేటు దవాఖానల నిలువు దోపిడీ కంగారెత్తిస్తుంది. ఈ సమయంలో దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు బతకాల్సి వస్తుంది.
బండి నడుపుతున్న మాటేగానీ రాజారెడ్డి మనసులో ఆలోచనలు గింగిరాలు కొడుతున్నాయి. ఎటో ఆలోచిస్తూ పరధ్యానంగా బైక్ నడుపుతున్నాడు. కరోనా ఎంత చావు భయం పుట్టించినా రోడ్ల మీద జనసమర్థ్యం మాత్రం తగ్గడం లేదు. మూతులకు మాస్కులు పెట్టుకొని ఎవరి పనులకు వారు వెళ్లేందుకు హడావుడి పడుతున్నట్లు కనిపించారు. ముఖాలకు మాస్కులు పెట్టుక్కున్నా కనిపించే వారి కళ్లల్లో లీలమాత్రంగా ఆందోళన కనిపిస్తుంది. పొట్టతిప్పలకు చావును ఎదుర్కొనేందుకు వారంతా తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల పైకి వచ్చినట్లుగా తోస్తున్నది.
ప్రెస్ క్లబ్ రానే వచ్చింది. అక్కడంతా హడావుడి కనిపిస్తున్నది… జర్నలిస్టులకు రెండు రోజులుగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారక్కడ.
నిత్యం పదుల సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. కొందరు హెూం ఐసోలేషను పరిమితం కాగా… మరికొందరు ప్రాణాలరచేతిలో పెట్టుకొని సర్కారు దవాఖానకు వెళ్తున్నారు. ఇంకొందరు తప్పనిసరి ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు.
“రెడ్డి నువ్వు టెస్ట్ చేపించుకోవా?” యూనియన్ లీడర్ నారాయణ అడిగాడు. ” నేను చేపించుకోనన్న… నాకు ఎలాంటి లక్షణాలు లేవు.” అన్నాడు రాజారెడ్డి.
” ఒక్కసారి చేపించుకుంటే ఏమైందబ్బా… ముదిరినంక దవఖానకు ఉరికే బదులు..” అన్నాడు. అయినా రాజారెడ్డికి మనసొప్పలేదు.
“ఇట్ల నిర్లక్ష్యం చేసే గణేశ్ ఇపుడు ప్రైవేటులో అడ్మిటయ్యాడు. వాడు నాలుగైదు లక్షలు వసూలు చేసి పంపాడు….” అని అన్నాడు.
“ఇపుడెట్లుందన్నా గణేశ కు” అన్నాడు రాజిరెడ్డి. అక్కడే ఓ బెంచీపై కూర్చుంటు.
” బాగానే ఉన్నాడు… కానీ అతని భార్య, పిల్లలు, తల్లికి కూడా కరోనా వచ్చిందట … ఘోరం కదా “ అన్నాడు.
“అయ్యో… ఇపుడెలా మరి?” అన్నాడు రెడ్డి. “ వారిని అదే ఇరుకు ఇంట్లో ఉంచి ట్రీట్ మెంట్ చాలు చేశాడంట … ”
“ వాళ్లమ్మను తీసుకుపొమ్మని వాళ్లన్నను గణేశ్ అడిగాడంట… కానీ అన్న మాత్రం తీసుకుపోలేదంట. పెండ్లాం ఏం చెప్పిందోమరి.?” అన్నాడు నారాయణ.
“ఇలాంటి సమయంలో అమ్మను చూసుకునేందుకు కూడా వాడికి వీలుకాలేదా? “ ఇదంతా వింటున్న నరహరి జోక్యం చేసుకుంటూ అడిగాడు.
“అమ్మైతే ఏంది ….ఆమె వల్ల కరోనా వాళ్లకు రాదా? అందుకే వద్దన్నట్టున్నాడు దుర్మార్గుడు….” అన్నాడు మరో రిపోర్టర్ మధు.
” సిటీకి దూరంగా ఊరవతల గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఓ ఐసోలేషన్ సెంటర్లో వేద్దామని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడంట.. గణేష్ వాళ్ళ అన్న.” నారాయణ కోపంగా అన్నాడు.
“మరేమైంది?” రాజారెడ్డి ఆసక్తిగా అడిగాడు.
” ఏమైతది…. అన్న వ్యవహారం చూసినంక గణేశ్ కు చిర్రెత్తుకొచ్చిందంట. ఊరవతల ఐసోలేషన్లో వేస్తే అక్కడి వాతావరణానికి భయపడి అమ్మ నాలుగు రోజులు బతికేది అప్పుడే చచ్చిపోతది.. ఏమవసరం లేదు… నా ఇంట్లోనే ఓ గదిలో ఉంచుకొని నేను చూసుకుంటాలే అని చెప్పుతీసి కొట్టినట్లుగా సమాధానమిచ్చాడంట…” అన్నాడు నారాయణ.
” మంచి పనిచేశాడు… కరోనాతో మనుషులే కాదు భయ్యా… మానవత్వం, మమకారం కూడా సచ్చిపోతున్నది ” అన్నాడు ఆవేదనగా మధు.
” బంధాలు, బంధుత్వాలకు, ఆత్మీయతకు కూడా కరోనా సోకిందేమో అన్న ” అన్నాడు నారాయణ.
రాజారెడ్డి ఫోన్ మోగింది. తన బాస్ చండశాసనుడు ఫోన్ చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కొంత దూరం వెళ్లి వినయంగా వంగి వంగి మాట్లాడుతున్నాడు. అవతల నుంచి ఆ
బాస్ ఏమంటున్నాడో గాని…. రాజారెడ్డి అడ్డంగా నిలువుగా భయం భయంగా తల ఊపుతూ సరేనంటున్నాడు. కొన్ని సెకన్లకే అవతలి నుంచి ఫోన్ డిస్ కనెక్ట్ అయ్యింది. అక్కడి నుంచి వాడిపోయిన ముఖంతో మళ్లీ మిగిలిన రిపోర్టర్ల దగ్గరకి వచ్చాడు రాజారెడ్డి.
“ఏమైందన్నా అలా ఉన్నావు?” అడిగాడు నారాయణ. “ ఏం చెప్పమంటావన్నా టార్గెట్ టార్గెట్ అంటూ చంపుతున్నాడు మావోడు…..” అన్నాడు. “ గిప్పుడేం టార్గెట్ అన్నా… బతకడమే కష్టమైపోతుంటే”
“అయినా మీది అధికార పార్టీ పత్రిక కదన్నా…… మరీ ఇంతలా పీడించాలా?” అన్నాడా యూనియన్ నేత. “ అందరికంటే వీరే ముందు వరుసలో ఉన్నారన్నా ఉద్యోగులను పీకేయడంలో. జీతాల భారం తగ్గించుకునే నెపంతో చాలా కుటుంబాలను రోడ్డున పడేశారన్నా….” మధు ఆవేశంగా చెప్తున్నాడు.
” ఏం రోగమయ్యా మీకు కూడా?” అన్నాడు నారాయణ ముఖం చిట్లించి. ” రోజూ ఈ టార్చర్ ఎందుకన్నా వేరే పేపర్ చూసుకోరాదు?” అని అక్కడికొచ్చిన మోహన్ సలహా ఇచ్చాడు.
” ఏ పేపర్ లో ఏముంది వయా గర్వకారణం…. అన్నీ ఒక్కతాను ముక్కలే. ఎక్కడికి పోయినా ఈ టార్చర్ తప్పదు…” అన్నాడు నారాయణ.
“ అసలు ఈ సమయంలో కొత్తగా ఎవరినీ తీసుకోవడమే లేదు… ఉన్నోళ్లనే ఎట్ల సాగనంపాలె అని చూస్తున్నారు” కసిగా అన్నాడు మధు.
” కరోనా అందరి జీవితాలను ఆగం చేస్తున్నది భయ్యా….” అన్నాడు నరహరి.
” జీవితాలను కరోనా ఆగం చేస్తున్నదంటే గుర్తొచ్చింది…. మొన్న అర్థరాత్రి నగర నడిబొడ్డున ….కలెక్టరేట్ లోనే ఓ ఇరవై ఐదేళ్ల అమ్మాయిని నలుగురు ఆటో డ్రైవర్లు రేప్ చేశారనే వార్త ఇచ్చాం కదా… గుర్తుందా?” అని అడిగాడు నరహరి.
” ఈ క్రైమ్ వార్తను ఎవరైనా ఫాలో అప్ చేశారా?
నేను దీన్ని ఇన్వెస్ట్ గేషన్ చేసిన… ఆసక్తికరమైన, దిమ్మదిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి తెలుసా? ” మధ్యలో కొద్దిసేపు ఆగాడు నరహరి.
” అసలేం తెలుసుకున్నావు ఈ కేసులో….?” అడిగాడు నారాయణ.
” ఆ అమ్మాయికి డబ్బులు ఇస్తానని అర్థరాత్రి ఒకడు కలెక్టరేట్ సమీపంలోకి తీసుకువచ్చాడు. లోపల పాడుపడిన బంగ్లాలోకి ఆమెను అతడు తీసుకుపోయి అఘాయిత్యం చేసిన తర్వాత మరో నలుగురు స్నేహితులకు ఫోన్ చేసి రప్పించాడు.”
నరహరి చెప్పసాగాడు.. చుట్టూ గుమిగూడిన అందరూ ఆసక్తిగా వింటున్నారు.
” ఆ వచ్చిన నలుగురు కూడా ఆ అమ్మాయిని సామూహికంగా అత్యాచారం చేశారు. ఆమె ప్రతిఘటిస్తున్నా వారంతా పశువాంఛ తీర్చుకున్నారు.
అప్పటికే ఆ ప్రాంతానికి పోలీస్ పెట్రోలింగ్ వ్యాస్ రాగానే వారంతా తలోదిక్కు పారిపోయారు.
పోలీసులు గానీ కాస్త ఆలస్యంగా ఈ ప్రాంతానికి వచ్చి ఉంటే ఆ రోజు ఆ అమ్మాయి దారుణ హత్యకు గురయ్యేది కావొచ్చు.”
” అవునా?” అని అందరూ ఆసక్తిగా వింటున్నారు. “ అంతే కాదు…. ఇందులో కీలకమైన విషయమింకొకటి ఉంది?” ఏంటీ?

“ అసలు ఆ అమ్మాయిని వ్యభిచార వృత్తిలోకి దించిందెవరో తెలుసా?”

You missed