ఎదురుకాల్పులు.. ఒక్కప్పడు అన్నల జమానాలో ఇది తరుచుగా వినిపించే పదం. రోజు పొద్దున లేస్తే ఏదో ఒక చోట.. ఎన్కౌంటర్ పేరుతో పోలీసుల కాల్పులు.. మావోయిస్టుల హత్యలు కామన్‌గా వస్తూండేవి. ఆ తర్వాత నక్సలైట్ల ఉనికి మసకబారిపోయింది. పెరుగుతున్న టెక్నాలజీ ఆ సిస్టంను కొలాప్స్ చేసింది. పోలీసులకు వీరిని వేటాడేందుకు మరింత సులువైంది. పల్లెల్లో అంతటి పెద్ద నేరాలూ కూడా జరగడం లేదు. అందరిలో అంతో ఇంతో చైతన్యం వచ్చింది. ఎదురుతిరిగే స్వభావం పెరిగింది. ప్రశ్నించే మనస్తత్వం అలవడింది.
కానీ ఈమధ్య కాలంలో రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఎకడ్నో.. ఏదో రాష్ట్రంలోనో ఇలాంటి వార్తలు చదివి.. ఛీ.. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అబ్బ అక్కడ సమాజం ఎలా ఉంటుంది? ఎలా బ్రతుకుతున్నారక్కడ? అని అనుకునేవారు. కానీ ఎక్కడో యూపీలో కాదు.. బీహార్‌లో కాదు.. ఇక్కడా అలాంటివి ఇప్పుడు కామన్‌గా మారాయి. వినీ వినీ, చూసీ చూసీ ఇలాంటివి మనకు కూడా భవిష్యత్తులో కామన్‌గా మారిపోతాయేమో. మన మెదళ్లు కూడా వీటికి ట్యూన్ అయిపోయి.. లైట్ గా తీసుకుంటాయోమో. ఏదైనా ఘోరం, దారుణం జరిగినప్పుడు ఆవేశంగా స్పందిస్తాం. ఆ నిందితుడ్ని చంపగానే చల్లబడి మన పనిలో బిజీ అవుతాం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాం. సమాజం గురించి ఎంతో ఆలోచిస్తాం. ఎన్కౌంటర్ చేసేయాల్సిందేనని ఆల్టిమేటం జారీ చేస్తాం. కానీ పరిస్థితులు ఎందుకిలా మారుతున్నాయని ఆలోచించం. ఇంకా ఎంతదూరం ఇది పోతుందో అంచనా వేయం. దీనికి ఎవరు కారణం అని ఆలోచించం. అంతే అప్పటికప్పుడు సత్వర న్యాయం జరిగితే చాలు. ఆవేశం చల్లబడితే చాలు. ఆ తర్వాత ఇంకొకటా? మళ్లీ ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తాం. ఇలా మారాయి ఈ మధ్యకాలంలో పరిస్థితులు.
ఇదే ట్రెండ్ అమలైతే .. రాష్ట్రం పరువు బజారున పడుతుంది. ఇది గ్రహించింది సర్కార్. అందుకే పంథా మార్చుకుంది. తుపాకులు లేని ఎన్కౌంటర్ బాటను ఎంచుకుంది. చైత్ర రేప్, మర్డర్ నిందితుడు రాజును అలాగే అంతమొందించారు. ఇక ముందు కూడా ఇదే స్టైల్ ఉంటుంది ఇక్కడ. సత్వర న్యాయం కావాలంటే చంపాలి. చంపాలంటే ఎన్కౌంటర్ చేయాలి. అలా చేస్తే పరువు పోతుంది. అందుకే ఇకపై తుపాకుల్లేని ఎన్కౌంటర్లు చూస్తాం. కొత్త కొత్త పద్దతుల కోసం పోలీసులు సర్చ్ చేస్తారు. మరి నిందుతులను చంపిన తర్వాత మళ్లీ అలాంటి దారుణాలకు ఎవరూ పాల్పడరు కదా? అని అడుతున్నారా? సమాజంలోకి దూరిపోయిన చెడు అలవాట్లు, వింత పోకడలు, టెక్నాలజీ, ఇంటర్నెట్… ఇవన్నీ ఉన్నన్ని రోజులు .. ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. కొన్ని బయటపడతాయి. కొన్ని వెలుగుచూడవు. అలా వెలుగుచూసినవి తుపాకుల్లేకుండా ఎన్కౌంటర్ అవుతాయి.